AOB Tribal Attack : తిరగబడ్డ అడవి బిడ్డలు- చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌పై గిరిపుత్రుల మూకుమ్మడి దాడి
పచ్చని అడవిలో చిచ్చు రేగింది. కారణమేదైనా పోలీస్‌స్టేషన్‌పై గిరిజనుల దాడి సంచలనంగా మారింది.
అడవి బిడ్డలు ఆగ్రహించారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌పైనే తమ ప్రతాపం చూపారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లోని చిత్రకొండ పోలీస్ స్టేషన్‌పై గిరిజనులు మూకుమ్మడి దాడి చేశారు. ఏవోబీలో గిరిజనులపై దాడి చేసినందుకు నిరసనగా సోమవారం చిత్రకొండ పోలీస్ స్టేషన్‌పై పడ్డారు గిరిజనలు.
సాంప్రదాయ ఆయుధాలతో దాడి చేయడంతో చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కత్తులు, కొడవళ్లు, కర్రలతోపాటు సాంప్రదాయ ఆయుధాలైన విల్లు, బాణాలతో వారు దాడికి ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు స్టేషన్ ముందున్న ఇనుప గేటును మూసివేయగా.. దాన్ని తోసుకుని మరీ గిరిపుత్రులు స్టేషన్‌లోనికి చొరబడ్డారు. స్టేషన్‌లోకి చొరబడిసామగ్రిని, వాహనాలను ధ్వంసం చేశారు.
చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌పై గిరిజనులు దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో చిత్రకొండ స్టేషన్ పరిధిలోని 7 పంచాయతీల్లోని గిరిజనులు పాల్గొన్నట్టు సమాచారం. ఏవోబీలో కటాఫ్ ఏరియాలో గురుప్రియ వంతెన నిర్మాణం జరిగిన తరువాత పరిసర పంచాయతీలు అభివృద్దిపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి సారించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీన్ని నిరసిస్తూనే ఏడు పంచాయతీలకు చెందిన గిరిజనులు ఆందోళనకు దిగారు. కాసేపటి తర్వాత ఆ ఆందోళన కాస్త దాడికి దారి తీసింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని కథనాలు వెలువడుతున్నాయి. ఏవోబీలోని కటాఫ్ ఏరియాలోని బొడపొదర్, నవగూడాచ, దొరగూడ, గుంటవాడ, పప్పులూరు, కుర్మనూరు పంచాయతీలకు చెందిన వందల మంది గిరిజనులు ఆందోళనలో పాల్గొన్నారు. తమకు అభివృద్ధి ఫలాలు అందాలని డిమాండ్ చేశారు. ఇలా డిమాండ్ చేస్తూనే... సభాస్థలి నుంచి నేరుగా చిత్రకొండ పోలీసుస్టేషన్‌పై ముట్టడికి బయల్దేరారు. సాంప్రదాయ ఆయుధాలతో దాడికి యత్నించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
గంజాయి గొడవే అసలు కారణం ?
గత వారం రోజులు నుంచి చిత్రకొండ పోలీసులు ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో గంజాయ నిల్వలపై పోలీసులు దాడి చేస్తూ వస్తున్నారు. సమయంలో గిరిజనులకు, పోలీసులకు మధ్య జరిగిన గొడవే ఈ దాడికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ ఉన్నతాధికారులు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.