Tiger Wandering: శ్రీకాకుళం జిల్లా కంచిలిలో పెద్దపులి సంచారం- వణికిపోతున్న మూడు మండలాల ప్రజలు
Tiger wandering News: శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారంపై డీఆర్ఓ నిషాకుమారి స్పందించారు.
Tiger wandering in srikakulam district:
శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా జిల్లాలో కొన్నిచోట్ల పులి సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. తాజాగా కంచిలి మండలం మండపల్లి పంచాయతీ, అమ్మగరిపుట్టుగు, బంజీర్ నారాయణపురం, మండపల్లి గ్రామాల్లో పెద్దపులి తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పులి అడుగు జాడలు (పాద ముద్రలు) గుర్తించిన అనంతరం అటవీశాఖ అధికారులు చుట్టుపక్కల గ్రామాల వారిని అప్రమత్తం చేశారు. పెద్దపులి సంచరిస్తున్నందున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వారిని హెచ్చరించారు.
పులి పాదముద్రలు గుర్తింపు..
శ్రీకాకుళం జిల్లాలో పులి సంచారంపై డీఆర్ఓ నిషాకుమారి స్పందించారు. జిల్లాలోని అమ్మగరిపుట్టుగులోని మండపల్లి పంచాయతీలో టైగర్ పాదముద్రలు గుర్తించామని తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో పులి సంచారం ఉందని వెల్లడించారు. పులి తిరుగున్నట్లు అక్టోబర్ 25న అటవీశాఖ అధికారులు గుర్తించారు. అప్పటినుంచి పులి జాడ కోసం అధికారులు చర్యలు తీసుకున్నారు. పులి సంచరిస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏవైనా అనుమానాస్పద గుర్తులు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఏమైనా పెంపుడు జంతువులపై పులి దాడి చేసి చంపేస్తే ప్రభుత్వం చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. పులి సంచారంపై సమీప గ్రామాల్లో సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామన్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో కలకలం!
ఆంధ్రా- ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో గత కొన్ని రోజులుగా పులి సంచరిస్తోంది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, గరబండ, రౌతుపురం, రంప, కురాడ, బందహంస సరిహద్దు గ్రామాలలో గత వారం రోజుల నుంచి పులి సంచరిస్తోందని స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు.
అక్టోబర్ 21 నుంచి పులి సంచారాన్ని ఒడిశా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఏఓబీ బార్డర్ లో పులి సంచరిస్తుండటంతో రెండు రాష్ట్రాల అధికారులు పులిని ట్రాప్ చేయడం కోసం చర్యలు చేపట్టారు. ముఖ్యంగా శ్రీకాకుళంలోని ఉద్దానం, మండపల్లి, అమ్మవారిపుట్టగ, బంజిరినారాయణపురం, మెళియాపుట్టి మండలంలోని గొప్పిలి, గోకర్ణపురం, చిన్నహంస, భరణికోట, కొలిగాం ప్రాంతాల్లో పులి సంచరిస్తుంది. జీడి మామిడి తోటలు ఎక్కువగా ఉన్న చోట పులి పాద ముద్రలు గుర్తించారు. ఎతుగుబంట్లు కూడా ఈ ప్రాంతాల్లో తరచుగా స్థానికులకు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. పంట పొలాల్లో పులి ఆనవాళ్లు అటవీశాఖ గుర్తించి స్థానికులకు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.