Vizag Building Collapse: విశాఖలో అర్ధరాత్రి తీవ్ర విషాదం! కుప్పకూలిన భవనం, అక్కడికక్కడే ముగ్గురు మృతి
ఈ దుర్ఘటనలో భవన శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. వీరి సంఖ్య పెరిగేటట్లు తెలుస్తోంది.
విశాఖపట్నంలో ఉగాది పండగ పూట విషాదం నెలకొంది. కలెక్టరేట్ సమీపంలోని రామజోగి పేటలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో భవన శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. వీరి సంఖ్య పెరిగేటట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న మరో ఆరుగురిని రక్షించి స్థానికులు, రెస్క్యూ సిబ్బంది కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు పురాతన భవనం కూలినట్టు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. భవనం ఒక్కసారిగా కుప్పకూలిన శబ్ధాలకు పరిసర ప్రాంత ప్రజల భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న ఎన్టీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
బిల్డింగ్ కుప్పకూలడంతో బాలిక సాకేటి అంజలి (15) అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. రామకృష్ణ మిషన్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది అంజలి. ప్రస్తుతం ఆమె సోదరుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. శిథిలాలలో మరో యువకుడు కూడా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. G+ 2 భవంతిలో రెండు కుటుంబాలతో పాటు ఇద్దరు బ్యాచిలర్స్ నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. భవనం లో మొత్తం 9 మంది ఉన్నట్టు సమాచారం అందుతోంది. వారిలో వారిలో అంజలి చనిపోగా మరో ఆరుగురిని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు ఎన్టీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది. కాగా నిన్న (మార్చి 23) అంజలి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడం కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగుల్చుతోంది. దీంతో అంజలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
కాగా శిథిలాల నుంచి మరొక మృత దేహం వెలికితీశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న నూడిల్స్ షాప్ సహాయకుడిని చోటుగా గుర్తించారు. బిహార్ కు చెందిన చోటు వయసు 30 సంవత్సరాలు. మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.
భవనంలో ఉంటున్నవారి వివరాలు ఇవీ
గ్రౌండ్ ఫ్లోర్
1) కొమ్మిశెట్టి శివశంకర్ సన్నాఫ్ నాగేశ్వరరావు వయసు 29 సంవత్సరాలు. నూడిల్స్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. సొంత ఊరు విజయవాడ దగ్గర ఉన్న కృష్ణలంక, గత వారం రోజుల నుంచి మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు.
2) చోటు బిహార్ కి చెందిన వ్యక్తి కూడా ఉంటున్నాడు
ఫస్ట్ ఫ్లోర్
1) సాకేటి రామారావు సన్నాఫ్ గురువులు. వయసు 39 సంవత్సరాలు
2) సాకేటి కళ్యాణి వైఫ్ ఆఫ్ రామారావు, ఈమె ఆయుష్మాన్ హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ గా పని చేస్తుంది.
3) సాకేటి దుర్గాప్రసాద్ సన్నాఫ్ రామారావు. ఈ యువకుడు ఇంటర్మీడియట్ సెకండియర్ ఆచారి కాలేజీలో చదువుతున్నాడు.
4) సాకేటి అంజలి D/o రామారావు, ఈ యువతి రామకృష్ణ మిషన్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతుంది.
సెకండ్ ఫ్లోర్
1) సన్నాపు కృష్ణ సన్నాఫ్ నాగేశ్వరరావు (late), వయసు 30 సంవత్సరాలు. సొంత ఊరు బొమ్మ లక్ష్మీపురం దగ్గర ఉన్న దుమ్మరి గ్రామం, అరవింద్ క్యాటరింగ్ దండ బజార్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
2) పాతిక రోజా రాణి వైఫ్ ఆఫ్ కృష్ణ వయసు 29 సంవత్సరాలు. ఆయుష్మాన్ హాస్పిటల్ లో ఐసీయూలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.