Vamsadhara Project: దిక్కులేని దేవుడు-వంశధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో విచిత్ర పరిస్థితి
దేవుడికి కష్టం వచ్చింది. ప్రాజెక్టు కోసం గ్రామాలను తరలిస్తున్న అధికారులు అక్కడ ఉన్న ప్రార్థనామందిరాలు మాత్రం విస్మరిస్తున్నారు. దీంతో ఎలాంటి ధూపదీపాలకు దిక్కులేకుండా పోయింది.
మనుషులకు కష్టం వచ్చినా భగవంతుడా అంటారు. అంతా దేవుడి దయ అంటూ ఇష్టమైన దైవాన్ని సమస్యలు చెప్పుకుంటారు. సమస్త భక్తులకు ఆరాధ్యుడైన ఆ దేవుడికే ఇప్పుడు కష్టం వచ్చి పడింది. ప్రాజెక్టు పేరుతో అక్కడ గ్రామాలను తరలించారు. ప్రాజెక్టు పేరుతో అక్కడ దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలు లేక దిక్కులేనివిగా అక్కడి దేవాలయాలు.
ప్రాచీన సాంప్రదాయాలకు సంస్కృతులకు పురాతన చరిత్రకు సిక్కోలు నిలువెత్తు సాక్ష్యం. సిక్కోలు జిల్లా భక్తి భావం ఎక్కువ. అందుకే ఏ ఊరిలో చూసిన ఏదో గుడి కనిపిస్తుంటుంది. వాటిని తమ ఇంటి దేవతగా కొలుస్తుంటారు. ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా గుడికి వెళ్లి దండం పెట్టుకుంటారు. అలాంటి ఆలయాలకు ఇప్పుడు అనుకోని కష్టం వచ్చి పడింది.
శ్రీకాకుళంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వంశధార ప్రాజెక్టు రెండో దశ కింద పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద కొత్తూరు, హిరమండలం, ఎల్లంపేట, 19 నిర్వాసిత గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు పోలీస్ పహారా మధ్య ఆగమేఘాల మధ్య గ్రామాలను ఖాళీ చేయించారు. నివాసాలను నేలమట్టం చేశారు. కనీసం ప్రాజెక్టు పూర్తయినంత వరకు గడ్డ ఉంటామన్నా సరే కనికరించలేదు. 19 గ్రామాల ప్రజలు గుడులు, బడులను వదిలేసి తరలిపోయారు.
సుమారు పది వేల కుటుంబాల్లో ఏడు వేల కుటుంబాలు నిర్వాసితులుగా మారారు. జనాలు తరలిపోయారే కానీ వారి సెంటిమెంట్ పల్లెలతో ముడిపడి ఉండిపోయింది. ఈ గ్రామాలు ఏర్పాటైన నాటి నుంచి దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలతో వారికున్న అనుబంధాన్ని వదులుకోలేకపోతున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించుకున్న గుళ్ళను పట్టించుకున్న వాళ్లే లేకుండా పోయారు. వంశధార నిర్వాసిత గ్రామాల్లో హిందువులకు సంబంధించి 48 పురాతన కట్టడాలు ఉన్నాయి. గ్రామ దేవత గుడులు 42 ఉన్నాయి. 20 వరకు చర్చలు ఉన్నాయి.
19 గ్రామాల ప్రజలను తరలించిన అధికారులు ప్రార్థనా మందిరాలను మాత్రం వదిలేశారు. ఒకటి రెండు మినహా పునరావాస కాలనీల్లో ఎక్కడ దేవాలయాలను నిర్మించలేదు. నిత్యం ధూపదీప నైవేద్య, ప్రార్థనలు అందుకునే దేవుళ్ళు ఇప్పుడు ఎటువంటి సేవలకు నోచుకోవడం లేదు. ఫలితంగా నిర్వాసిత గ్రామాల్లో దేవుళ్ళు దిక్కు లేని వారిగా మిగిలిపోయారు.
ఒకప్పుడు నిత్యపూజలందుకుంటున్న దేవుని వదిలేయ లేక పూజలు చేసేందుకు దారి లేక ఉసూరుమంటున్నారు ఇక్కడి ప్రజలు. పూజలు చేసేందుకు అర్చకులు వెళ్లాలని అనుకున్నా... భక్తులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇష్ట దైవాన్ని ప్రార్ధించుకోవాలన్నా...దైవ దర్శనం రావాలన్న పండగ సమయంలో శిథిలాల మధ్య నడుచుకుంటూ దేవాలయం చేరుకునేసరికి నిర్వాసితులకు నిజంగానే దేవుడు కనిపిస్తున్నాడు. వేరే ప్రాంతాల్లో ప్రార్థనాలయాలు నిర్మిస్తామని ఎప్పుడి నుంచో చెబుతున్న అధికారులు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలే జరగడం లేదంటున్నారు ఇక్కడి ప్రజలు.