TDP News: అచ్చెన్నకు, అధిష్టానానికి మధ్య గ్యాప్ వచ్చిందా! వదంతులకు కారణం ఏంటంటే!
TDP News : 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో అచ్చెన్నకు మంత్రి పదవి దక్కింది. అప్పటినుంచి జిల్లా రాజకీయాల్లో, టీడీపీలో అచ్చెన్న ప్రాధాన్యం పెరిగింది.
TDP News : జిల్లాతోపాటు ఉత్తరాంధ్రలోనూ ఆయన హవా సాగుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ అధికారంలో లేకున్నా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అధినేతతో ప్రతి సమావేశంలోనూ వేదిక పంచుకుని కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా నిలుస్తున్నారు. అసెంబ్లీలోనూ, బయట పార్టీ గొంతును బలంగా వినిపిస్తున్నారు. ఈ క్రమంలో బీఏసీ సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే ఇందులో మార్పులు వస్తున్నాయని పార్టీలో టాక్ నడుస్తోంది. అధినాయకత్వంతో ముఖ్యంగా యువనేతతో ఆ నాయకుడికి గ్యాప్ పెరిగిందని ప్రచారం జరుగుతోంది.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిది పార్టీలో ప్రత్యేక పాత్ర. అధికారంలోకి రావడంతో 2014లో అచ్చెన్నకు మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి జిల్లా రాజకీయాల్లో, టీడీపీలో అచ్చెన్న ప్రాధాన్యం పెరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ ప్రభంజనంలోనూ టెక్కలిలో అచ్చెన్న విజయం సాధించారు. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నపై కేసు నమోదు చేసి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు.
ఎన్నికలు దగ్గర పడే కొద్ది అచ్చెన్నపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అచ్చెన్నకు, అధిష్టానానికి మధ్య గ్యాప్ వచ్చిందని ప్రత్యర్థులు చెప్పుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో ఈ టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అచ్చెన్న అనుచరులుగా ముద్రపడిన వారికి రానున్న ఎన్నికల్లో టికెట్లు ఉండవని కూడా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అచ్చెన్నలో మార్పు వచ్చిందని వారి వాదన.
టీడీపీ అచ్చెన్నకు తిరుగు లేదని ఆయన్న సన్నిహితులు చెబుతుంటే... అది ఒకప్పటి మాటని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఆయన మాట చంద్రబాబు, లోకేష్ వద్ద చెల్లుబాటు కావడం లేదని అంటున్నారు. రెండేళ్ల కిందట తిరుపతిలో అచ్చెన్న చేసిన కామెంట్స్‌ను వైరి వర్గం గుర్తు చేస్తోంది. లోకేశ్‌పై కూడా కామెంట్స్ చేశారని అవి అధినాయకత్వానికి చేరాయని అంటున్నారు. అప్పుడు మొదలైన చీలిక పెరిగి పెద్దదైందని అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కూడా సీనియర్ నేతలతో అచ్చెన్నకు పొసగడం లేదని అంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారంతా లోకేష్‌తో సత్సంధాలు నెరుపుతున్నారని... వారి మాటే జిల్లాలో చెల్లుబాటు అవుతుందని చెప్పుకుంటున్నారు. అచ్చెన్న మాట కంటే వాళ్లకే ప్రాధాన్యత లభిస్తోందని ప్రచారం చేస్తున్నారు.
రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగా జరిగిన ఇన్సిటెండ్‌ను జిల్లా నాయకులు గుర్తు చేస్తున్నారు. యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి మహానాడుకు వచ్చిన లోకేష్‌కు ఆలింగనం చేసుకొని ఆహ్వానించడంలో అచ్నెన్న తటాపటాయించారని చెప్పుకుంటున్నారు. అయితే వేడి కారణంగా చెమటుల పట్టాయని.. లోకేష్ ఇబ్బంది పడతారనే అలా చేయడానికి ఆలోచించారని అచ్చెన్న వర్గం కౌంటర్ ఇస్తోంది.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్చ్ విషయంలో కూడా విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ సీనియర్ నాయకుడు పతివాడ నారాయణస్వామినాయుడు కుటుంబాన్ని కాదని కర్రోతు బంగార్రాజు పేరును ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించడంలో అచ్చెన్న పాత్ర ఉందనే ప్రచారం జరిగింది. దీనిపై లోకేష్‌కు ఫిర్యాదులు కూడా వెళ్లాయట.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నికుమారిని ముందు అధిష్టానం ఎంపిక చేసింది. అనూహ్యంగా వేపాడ చిరంజీవిని పేరు తెరపైకి తీసుకురావడంలో అచ్చెన్న చక్రం తిప్పారని అంటున్నారు. చిరంజీవి గెలవడంతో ఇది వివాదం కాలేదని అంటున్నారు అచ్చెన్న ప్రత్యర్థులు.
శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, టీడీపీలో గ్రూపుల విషయాన్ని వివరించారట. అచ్చెన్న పైనే ఫిర్యాదు చేశారని జిల్లా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇలా ప్రతి నియోజక వర్గంలో గ్రూపు రాజకీయాలకు అచ్చెన్నే కారణమవుతున్నారని అధినాయకత్వం వద్ద కొందరు ఉత్తరాంధ్ర నేతలు మొర పెట్టుకున్నారని చెబతున్నారు. చంద్రబాబుతో నేరుగా మాట్లాడే వాళ్లు ఆయన వద్ద, లోకేష్‌తో మాట్లాడే వాళ్లు ఆయన వద్ద అచ్చెన్నపై ఫిర్యాదు చేస్తున్నారట. అన్నింటినీ పరిశీలిస్తున్న పార్టీ అధిష్ఠానం ఆయనకు కళ్లెం వేస్తుందని అచ్చెన్న వైరి వర్గం ప్రచారం చేస్తోంది. ఈ నేతలు ఎవరూ బహిరంగా వచ్చి చెప్పేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.