Ganta Srinivasa Rao: సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అవ్వరు - ఎందుకో చెప్పిన గంటా శ్రీనివాసరావు
అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన వ్యవహారం రాష్ట్రమంతా కలకలం రేపితే డీజీపీ మాత్రం సిగ్గులేని మాటలు మాట్లాడారని అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే సెప్టెంబరు నుంచి విశాఖపట్నానికి కాపురాన్ని మార్చుతానని గతంలోనే ప్రకటించిన వేళ, తాజాగా గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ విశాఖపట్నానికి షిఫ్ట్ అవ్వబోరని చెప్పారు. విశాఖకు ప్రముఖులు గానీ, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు వచ్చే పరిస్థితి లేదని అన్నారు.
సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖకు పేరు ఉందని అన్నారు. అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్నే నగరం నడిబొడ్డున కిడ్నాప్ చేసిన విషయాన్ని అందరూ చూశారని అన్నారు. ఆ సంఘటన చూశాక, ఇక సీఎం జగన్ విశాఖపట్నానికి రాలేరని అన్నారు. విశాఖకు వచ్చే ఆలోచనను సీఎం జగన్ మానుకుంటారని అన్నారు. సీఎం జగన్ విశాఖకు వస్తే ఏ విశ్వసనీయతతో ఆయన ల్యాండ్ పూలింగ్ చేస్తారని అందరూ అడుగుతున్నారని అన్నారు.
అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన వ్యవహారం రాష్ట్రమంతా కలకలం రేపితే డీజీపీ మాత్రం సిగ్గులేని మాటలు మాట్లాడారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని, పోలీసులు భేషుగ్గా పని చేశారని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. కేసును తాము 4 గంటల్లో చేధించామని చెప్పుకొని, నిందితులను పట్టుకున్నామని చెప్పడం విడ్డూరమని అన్నారు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన రోజే ఓ టీనేజర్ ని సజీవ దహనం చేశారని గుర్తు చేశారు. విశాఖలో సెటిల్మెంట్లు, దందాలు, అక్రమాలు పెరుగుతున్నాయని స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర మొత్తం గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని అన్నారు. విశాఖలో చాలా వరకు సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదని చెప్పారు.
సీఐడీ చీఫ్ తెలంగాణలో ప్రెస్ పెట్టి మార్గదర్శి కేసుకు సంబంధించి ఎలా ప్రొజెక్ట్ చేశారో చూశారా? అని విమర్శించారు. ముఖ్యమంత్రికి అనుగుణంగా అధికారులు కూడా యథారాజా తథా ప్రజా అని తయారయ్యారని అన్నారు. ఇప్పటికే అధోగతి పాలైన రాష్ట్రానికి మంచి నాయకత్వం కావాలని, కాబట్టి వచ్చే ఎన్నికలు చాలా కీలకం అని అన్నారు. కాబట్టి కార్యకర్తలు బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు.