GVMC News: జీవీఎంసీలో ఎన్డీయే కూటమి సత్తా - టీడీపీ క్లీన్ స్వీప్, వైసీపీకి షాక్!
AP News: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గత మూడు సార్ల నుంచి వైసీపీ ప్రభుత్వమే సత్తా చాటుతోంది. కానీ, అసెంబ్లీ ఎన్నికల విజయంతో జోరు మీదున్న కూటమి ఇప్పుడు క్లీన్ స్వీప్ చేసింది.
Visakhapatnam News: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. అదే సమయంలో వైఎస్ఆర్ సీపీకి షాక్ తగిలింది. ఇందులో కూటమి ప్రభుత్వం 10కి 10 స్థానాలు గెల్చుకొని విజయకేతనం ఎగరవేసింది. ఇప్పటివరకు 3 సార్లు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగ్గా.. ప్రతిసారి వైసీపీనే గెలుస్తూ వచ్చింది. కానీ, ఈసారి చతికిలపడాల్సి వచ్చింది. తాజాగా సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కూటమి పార్టీలు జోరు మీద ఉండగా.. ఆ ధాటిని వైసీపీ తట్టుకోలేకపోయింది. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మూడేళ్ల తర్వాత కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి.
ఈ ఎన్నికలు జీవీఎంసీ మెయిన్ ఆఫీసులో బుధవారం (ఆగస్టు 7) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. మొత్తం 10 స్థానాలకు వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 96 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో ఒక్కొక్కరికి పది ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. మొత్తం 960 ఓట్లు పోల్ అవగా.. కూటమి తరఫున నిలబడిన 10 మంది టీడీపీ అభ్యర్థులు అన్ని స్థానాలూ గెలుచుకున్నారు. ఈ విజయంతో కూటమి శ్రేణుల్లో సంబరాలు ఆకాశాన్నంటాయి.
ఫలించని వైసీపీ ప్రయత్నాలు
అయితే, వైసీపీ గెలుపు కోసం ఆ పార్టీ విశ్వప్రయత్నాలు చేసింది. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి అయిన వైవీ సుబ్బారెడ్డి విశాఖపట్నంలో కొంత కాలంగా ఉంటూ వ్యూహాలు రచించారు. వైసీపీని వీడతారనే సమాచారం ఉన్న కార్పొరేటర్లతో చర్చించి, మిగిలిన వాళ్లతో క్యాంపు రాజకీయాలకు ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది.