విశాఖ నోట్ల మార్పిడీ కేసులో పోలీస్‌తోపాటు పొలిటికల్ హ్యాండ్- మేడంకు సినిమాలపైన కూడా ఇంట్రెస్ట్!
విశాఖలో వెలుగు చూసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఖాకీలతోపాటు ఖద్దర్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఎవరైనా మన డబ్బు లాక్కుంటే.. పోలీసులకు చెబుదాం. కానీ ఇక్కడ పోలీసులే లాక్కుంటే ఏం చేస్తాం.. అలాంటి ఘటనే విశాఖ నగరంలో జరిగింది. ఇద్దరు రిటైర్డు నేవీ ఉద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు గుంజేజారన్న ఆరోపణలపై విశాఖపట్నం హోం గార్డ్స్ ఆర్‌ఐ స్వర్ణలతపై కేసు నమోదైంది.
విశాఖలో మరో సంచలనం జరిగింది. ఇద్దరు వ్యక్తుల నుంచి బలవంతంగా డబ్బులు లాక్కున్నారన్న ఆరోపణలపై పోలీసు అధికారిణిపైనే కేసు నమోదైంది. నేరాలను అదుపుచేయాల్సిన పోలీసు అయ్యుండి తానే నేరం చేసేశారు. దారికాచి బెదిరించి డబ్బు దోచేశారు. విశాఖపట్నం హోం గార్డు ఆర్‌ఐ స్వర్ణలతపై ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా డబ్బు లాక్కున్నట్లు కేసు నమోదైంది. 386, 341, 506 r/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన సిబ్బందితో బెదిరించి 5 లక్షలు లాక్కున్నట్లు ఆరోపణలున్నాయి.
జరిగింది ఇదీ..
2వేల రూపాయల నోట్లను వెనక్కు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన తర్వాత చాలా వరకూ నల్లధనం వివిధ మార్గాల్లో బయటకు వస్తోంది. అదే ఇక్కడ నేరానికి బీజం వేసింది. విశాఖ నగరానికి చెందిన రిటైర్డ్ నేవల్ అధికారులు శ్రీధర్, శ్రీనివాస్ తమ వద్ద ఉన్న డబ్బుతో రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నారు. వీరికి సూరిబాబు అనే మధ్యవర్తి పరిచయం అయ్యాడు. రియల్ ఎస్టేట్ కన్నా ఎక్కువ డబ్బులు వచ్చే ఆఫర్ ఇస్తానంటూ నమ్మబలికాడు. 90లక్షల రూపాయలు 500నోట్లు తెస్తే.. కోటి రూపాయల 2వేల నోట్లు తీసుకోవచ్చని.. వాటిని వారు మార్చుకోవచ్చని చెప్పాడు. అతని మాటలు నమ్మిన వారు ఆ డబ్బు తెచ్చేందుకు సిద్ధమయ్యారు.
దారికాచి దోపిడీ
నోట్ల మార్పిడికి సిద్ధమైన శ్రీధర్, శ్రీనివాసరావు ముందుగా 12 లక్షలు మార్చాలని నిర్ణయించారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం సీతమ్మధారలోని NRI ఆసుపత్రి పరిసరాల్లోకి వచ్చారు. మధ్యవర్తి సూరిబాబు కూడా అక్కడకు చేరుకున్నారు. అయితే డబ్బు మార్పిడి కోసం పార్టీ రాకుండా ఆ వాహనంలో పోలీసులు వచ్చారు. ముందుగా కానిస్టేబుల్ హేమసుందర్ వచ్చి.. మీరు అనుమానస్పదంగా ఉన్నారంటూ.. వాహనాన్ని చెక్ చేశారు. డబ్బు బయటపడటంతో దీనిని సెటిల్ చేసుకోవడానికి సమీపంలోని కొండవైపు వాహనాన్ని తీసుకెళ్లారు. పోలీసు వాహనాన్ని అనుసరిస్తూ వెనక్కు రావాలసిందిగా చెప్పారు. అయితే ఈలోగా శ్రీధర్ వాహనంలో నుంచి డబ్బు తీసుకుని పారిపోయేందుకు సూరిబాబు ప్రయత్నించాడు. మఫ్టీలోని కానిస్టేబుల్, హోంగార్డు, శ్రీధర్ అతన్ని వెంబడించి పట్టుకున్నారు.
స్థానికులు అంతా పోగవ్వడంతో అసలు నిజాన్ని చెప్పేస్తానని సూరిబాబు బెదిరించడంతో అతనికి 5 లక్షలు ఇచ్చి పంపేశారు. ఆ తర్వాత మరో ఐదు లక్షలను ఆర్‌ఐ స్వర్ణలత కోసం కానిస్టేబుళ్లు తీసుకున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఆవిడ వాహనంలోనే ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత శ్రీధర్, శ్రీనివాస్ ను బెదిరించి హోంగార్డు, కానిస్టేబుల్ మిగిలిన 2లక్షలు కూడా తీసుకెళ్లారు. ఈనెల 1వతేదిన ఇది జరిగినట్లు తెలుస్తోంది. నోట్ల మార్పిడి కోసం తీసుకెళ్లిన డబ్బు కావడంతో బాధితులు కూడా ఎవరికీ చెప్పలేదు. అయితే తాము తప్పు చేయకముందే తమ సొంత డబ్బును పోలీసులు కొట్టేశారన్న బాధతో గురువారం ఫిర్యాదు చేశారు.
స్వర్ణలతకు రాజకీయ సంబంధాలు
స్వర్ణలత చాలా కాలం పాటు విశాఖ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. స్థానికంగా ఉండే రాజకీయ నాయకులతో మంచి సంబంధాలున్నాయి. సీఐ పైనే ఫిర్యాదు రావడంతో ఈ విషయం బయటకు రాకుండా చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ రాత్రి మీడియాకు తెలిసిపోవడంతో చేసేదేమీ లేక పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
సినిమాలపై ఆసక్తి
స్వర్ణలత సినిమాల్లో నటించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ ల్లో నటించిన ఆవిడ.. ఇప్పుడు మూవీలోనే నటించే ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి. ఆ రాజకీయ నేతకు సినీ పరిశ్రమతోనూ సంబంధాలున్నాయి.
అది పొలిటికల్ బ్లాక్‌మనీనా...?
విశాఖలో రియల్ ఎస్టేట్ చేసే ఓ ప్రజాప్రతినిధే ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా డబ్బు మార్పించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సీఐ స్వర్ణలతకు ఆ ప్రజాప్రతినిధితో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు నగదు మారుస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఎలా వచ్చింది... అసలు మధ్యవర్తి సూరిబాబుతో కూడా వీళ్లకు సంబంధాలున్నాయా..? నోట్ల మార్చుకుంటామని చెప్పిన “అవతలి పార్టీ” ఏది.. ? ఇవన్నీ కూడా సమాధానం రావలసిన ప్రశ్నలు