Vizag News : విశాఖలో మరో రియల్టర్ కిడ్నాప్ కలకలం - పోలీసుల అదుపులో నలుగురు నిందితులు !
విశాఖలో మరోసారి రియల్టర్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ఈ కేసులో నలుగురు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
Vizag News : విశాఖలో రియల్టర్ కుటుంబం కిడ్నాప్‌నకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ అనే రియల్టర్‌తో పాటు ఆయన భార్య లోవ లక్ష్మిని కిడ్నాప్ చేశారు. విశాఖలో 4 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతులిద్దరూ కిడ్నాప్‌నకు గురయ్యారు. కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ దంపతులు విజయవాడ నుంచి విశాఖకి కొద్ది రోజుల క్రితం వ్యాపారం నిమిత్తం వచ్చారు.
కిడ్నాపైన రియల్యర్ పై విజయవాడలో చీటింగ్ కేసు
2021 జూన్‌లో విజయవాడలో రియల్టర్ శ్రీనివాస్‌ని చీటింగ్ కేసులో పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3 కోట్లను శ్రీనివాస్ కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. అందులో 60 లక్షల రూపాయల ఇవ్వాలని కిడ్నాప్ చేసిన దుండగులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ కిడ్నాప్ ఎపిసోడ్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసులో పూర్తి వివరాలు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. వరుస కిడ్నాప్ ఘటనలు కలకలంరేపుతున్నాయి.
ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్ వ్యవహారం తర్వాత మరో ఘటన జరగడంతో కలకలం
ఇటీవల ఎంపీ కుటుంబం కిడ్నాప్ కు గురైంది. అది కూడా రియల్ ఎస్టేట్ వివాదమేనన్న అనుమానాలు వినిపించాయి. ఇద్దరు రౌడీషీటర్లు రెండు రోజుల పాటు ఎంపీ కుటుంబాన్ని ఆయన స్నేహితుడైన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావును అదుపులో ఉంచుకుని లక్షల నగదు తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు . చివరకు విషయం గుర్తించి ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. వెంటనే కిడ్నాపర్లను పట్టుకున్నారు. కానీ ఈ కేసులో ఇంకా ఎన్నో అనుమానాలు మిగిలిపోయి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ గొడవ కాదని రౌడీషీటర్లే డబ్బుల కోసం కిడ్నాప్ చేశారని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖలో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో ఇందులో ఎవో లొసులుగు ఉన్నాయని జనం నమ్ముతున్నారు.
విశాఖలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ వివాదాల గొడవలు
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఊపందుకున్నాయి. అదే సమయంలో రియల్ ఎస్టేట్ గొడవలు కూడా ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ నేత ల ప్రమేయంతో సెటిల్మెంట్ లు కూడా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతూండటంతో.. ఇవి మరీ ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో తరచూ కిడ్నాప్ లు చోటు చేసుకుంటూండటం.. అక్కడి ప్రజల్లో భయాందోలనలకు గురి చేస్తోంది. అయితే పోలీసులు మాత్రం విశాఖలో రౌడీషీటర్లను ఏరి వేశామని ప్రజలకు ఎలాంటి భయం అవసరం లేదని చెబుతున్నారు.