AP Postal Ballot Voting: ఏపీలో రూ.450 కోట్ల నగదు, మద్యం స్వాధీనం - పోస్టల్ బ్యాలెట్లకు మరో అవకాశం: సీఈవో
Andhra Pradesh News: ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి మే 7, 8 తేదీల్లో మరోసారి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. ఈ విషయాన్ని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
cVIGIL Portal- విజయనగరం: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకొనేందుకు మే 7, 8 తేదీల్లో మరో అవకాశాన్ని కల్పించారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ప్రకటించారు. ఆయన ఆదివారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని జెఎన్‌టియు గురజాడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌కు వెళ్లారు. ఓటింగ్‌కు చేసిన ఏర్పాట్లు, హెల్ప్ డెస్క్‌లు, క్యూలెన్లు, ఓటింగ్ ప్రక్రియ, పోలింగ్ బూత్‌లను ముఖేష్ కుమార్ మీనా సందర్శించారు. జిల్లాలో పోస్టల్ ఓటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను, ఎన్నికలు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆయనకు వివరించారు.
అనంతరం ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతీ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు, ఓటు కోసం ధరఖాస్తు చేసుకోని వారు సైతం తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేషన్ సెంటర్‌కు తీసుకువెళ్లి, ఓటు పొందాలని సూచించారు. వారి కోసం మే 7, 8 తేదీల్లో ఓటు వేయడానికి అవకాశం ఇస్తామన్నారు. అన్నిఫెసిలిటేషన్ సెంటర్లలో సౌకర్యాలను, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల శిక్షణ ఇచ్చారు. వివిధ విభాగాల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని, సి-విజిల్ (cVIGIL Portal) ద్వారా ఎక్కువ ఫిర్యాదుల అందుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 16,000 ఫిర్యాదులు రాగా, ఇందులో 99 శాతం ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈసీ కార్యాలయానికే 500 ఫిర్యాదులు అందాయని, వీటిలో 450 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముందుగా సంబంధిత పోస్టులను ఆ సోషల్ మీడియా వేదికల నుంచి తొలగిస్తున్నామని, సంబంధిత పార్టీ లేదా అభ్యర్ధిపై కేసులు నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటివరకూ రూ.450 కోట్ల నగదు, మద్యం స్వాధీనం
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.450కోట్ల నగదు, మద్యం, విలువైన పరికరాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు, ప్రలోభాలను అరికట్టేందుకు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్‌పోస్టుల ఏర్పాటుతో పాటు ప్రతీ మండలంలో మండల అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మద్యం రాకుండా, మద్యం ఉత్పత్తి కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లవద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేసి, మద్యాన్ని ఎక్కడికి రవాణా చేస్తున్నదీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వేరే రాష్ట్రాలనుంచి ఏపీలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 12,400 సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి.. అక్కడ వెబ్ కాస్టింగ్, కేంద్ర బలగాలను వినియోగించడం, మైక్రో అబ్జర్వర్ల నియామకం, వీడియో రికార్డింగ్ చేయనున్నారు. రాజకీయంగా సున్నితంగా ఉన్న 14 నియోజకవర్గాల్లో ఎన్నికల పరిశీలకులు సూచనల మేరకు వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ రోజు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎండ తగలకుండా క్యూలైన్ల వద్ద నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు, వృద్దులు, విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి ప్రశాంతంగా పోలింగ్ నిర్వహిస్తామన్నారు. తాగునీరు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఓటర్లకు ఎండ నుంచి రక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా సూచించారు.