(Source: ECI/ABP News/ABP Majha)
Pawan Kalyan: జగన్ ఒక్క ఛాన్స్ అయిపోయింది, ఇంటికి పంపడమే మిగిలింది: పవన్ కళ్యాణ్
Andhra Pradesh: ఏపీ ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే సీఎం జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని, భవిష్యత్తుకు గ్యారంటీ కావాలంటే ఆయనను ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
నాన్న లేని బిడ్డను, ఒకసారి అవకాశం ఇవ్వండని 2019 ఎన్నికల్లో జగన్ అడిగితే ప్రజలు ఒక్క ఇచ్చారని, దాంతో రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టిన జగన్ ఇంటికి పంపడమే మిగిలిందన్నారు పవన్ కళ్యాణ్. ఒక్క ఛాన్స్ కే అదే ప్రజలకి భవిష్యత్తు లేకుండా చేశాడని, ప్రజలు ఈసారి వారి భవిష్యత్తుకు ఛాన్సు ఇచ్చుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఎలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురంలో బుధవారం నిర్వహించిన వారాహి విజయభేరీ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ప్రజల ఆస్తులన్నీ కాజేసే కుట్రతో తీసుకొచ్చిన జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టును కేంద్రం మీదకు తోసి వైసీపీ చేతులు దులుపుకోవాలని చూస్తోంది. కేంద్రం చట్టాలు చేస్తే.. రాష్ట్రాలు తమకు అనుగుణంగా ముసాయిదా అమలు చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. ప్రజల ఆస్తులపై కన్నేసి, మరిన్ని అదనపు అంశాలను జోడించి ‘‘జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు’’ను తీసుకొచ్చింది ఏపీ సర్కార్. ఈ చట్టం ప్రకారం భూమి ఎవరైనా కబ్జా చేస్తే కనీసం కేసులు, కోర్టులు కూడా ఉండవు. మన ఆస్తిలో మనం కొన్ని రోజుల పాటు ఉండకపోతే అది అన్యాక్రాంతం అయి, మనకు తెలియకుండానే చేతులు మారిపోతుంది. ఆస్తులకు సంబంధించి ఒరిజినల్ పత్రాలు మన దగ్గర ఉండవు. కేవలం జిరాక్స్ పేపర్లు ఇస్తారట. ఒరిజినల్స్ ప్రభుత్వం వద్ద ఉంటాయి. మన ఆస్తులు తాకట్టు పెట్టుకోవడానికి కూడా కుదరదు. ఈ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టులో ఇలాంటి సవాలక్ష నిబంధనలు ఉన్నాయి.
జగన్ కు ఓటేస్తే మన సొంత ఆస్తులన్నీ గాలిలో దీపాలే అవుతాయి. ఒక్కసారి ఛాన్సు అడిగి జగన్ ఎన్ని దాష్టీకాలు చేశాడో మీకు తెలుసు. ఈసారి ఆ తప్పు జరగకుండా చూసుకోండి. ప్రజలు వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకునే ఛాన్సు ఇది. నాకు ప్రజల కోసం పోరాటం మాత్రమే తెలుసు. పోలవరం పునరావాస బాధితులకు అండగా ఉంటూనే, సెజ్ లలో భూములు కోల్పోయి నష్టపోయిన రైతులకీ అండగా ఉంటాను’ అన్నారు.
ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా..
ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, దానికి సంబంధించి డిజిటల్ కార్డుల పంపిణీ దేశంలోనే ఓ ఆరోగ్య విప్లవం అవుతుందన్నారు. తమకు అందుబాటులో ఉండే పెద్ద ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చు. దీనికి ప్రతి ఏటా ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేల సాయం, 10 మందికి ఉపాధినిచ్చే స్టార్టప్, చిన్న పరిశ్రమలకు రూ.10 లక్షల రాయితీతో యువతను ఎంటర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దుతుంది. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉపాధి కోసం కూటమి కట్టుబడి ఉంది. ఉపాధి జోన్లను ఏర్పాటు చేసి, స్థానికంగా ఉండే ఉద్యోగాలను యువతకు అందేలా చేస్తామన్నారు.
కన్నబాబురాజు కాదు.. కన్నాల బాబు
ఓ చిన్న సోషల్ మీడియా పోస్టు పెడితేనే వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. గడగడపకు కార్యక్రమంలో ఓ విద్యార్థి ఎమ్మెల్యే కన్నబాబురాజును ఫీజు రియంబర్సుమెంటు రాలేదని అడిగితే ఆ విద్యార్థిని చావబాదారని పవన్ అన్నారు. ఈ ఎమ్మెల్యే సింహాచలం ఆలయ భూములను ఇష్టానుసారం ఆక్రమించి భవంతులు కడుతున్నారు. 22 ఏ లోని నిషేధిత భూములపైనా కన్నేశారంటే ఎంతకు తెగించారో అర్ధం అవుతుందన్నారు. నియోజకవర్గంలో ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా ఈయనకు పర్సంటేజీ ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. కూటమి పాలనలో గంజాయి రవాణా చేసిన వారిని, మత్తు పదార్థాలు యువతకు అలవాటు చేసిన వారిని వదిలిపెట్టబోం అన్నారు. పాలన మొదలైన 100 రోజుల్లోపే గంజాయి ముఠాలకి ముకుతాడు వేస్తాం. ఆడబిడ్డలు తలెత్తుకొని తిరిగేలా చట్టాలను కఠినతరం చేస్తామన్నారు.
ఎలమంచిలి నియోజవకర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందరపు విజయ్ కుమార్ ను గాజు గ్లాసు గుర్తుపై, అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ కోరారు.