vizag steel plant anti privatization protest: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు ఉద్యమానికి నేటితో ఏడాది
vizag steel plant anti privatization protest: రైతుల ఉద్యమ స్ఫూర్తితో పోరాడుతామంటున్నారు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు. ఏడాదిగా సాగుతున్న ఉద్యమాన్ని తీవ్రత పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాయి సంఘాలు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(vizag steel plant) రద్దు చెయ్యాలంటూ అక్కడి ఉద్యోగులూ, కార్మికులూ ఏకధాటిగా చేస్తున్న ఉద్యమం మొదలై ఏడాది పూర్తైంది. వారికి సమాజంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగే వరకూ తమ పోరాటాన్ని ఆపేది లేదని కార్మిక ,ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. తమ పోరాటం ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంలో కోటి సంతకాల సేకరణ, 365 జెండాలతో దీక్షతోపాటు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు .
26 వేల ఎకరాల్లో విస్తరించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(Rashtriya Ispat Nigam LTD)గా పిలిచే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాదాపు 26 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని పేరు మీదే విశాఖ నగరానికి ఉక్కునగరం అనే పేరు స్థిరపడింది. ప్రారంభంలో ఏడాదికి 3. 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో మొదలైన స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 7. 3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది.
ప్రత్యక్షంగా 17,500 మంది ఉద్యోగులూ, పరోక్షంగా మరో లక్షమంది ఈ స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఈ సంస్థ నష్టాల్లో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఉపసంహరించు కోవడంతో ఏడాది క్రితం ఆందోళనలు మొదలయ్యాయి. స్టీల్ ఉత్పత్తుల్లో అనేక రికార్డులు సాధించిన స్టీల్ ప్లాంట్ 2015 నుంచి వరుసగా నష్టాలు చవిచూస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని కార్మిక సంఘాలు వాదన.
జిందాల్ లాంటి ప్రైవేటు సంస్థలకు గనులను కేటాయించిన ప్రభుత్వం... విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం అలంటి పనులు చేయడంలేదు. సొంత గనులు లేకపోవడంతో ముడి ఖనిజాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. దానితో గత కొన్నేళ్లుగా సంస్థ నష్టాలను నమోదు అవుతున్నాయి. వాటిని సాకుగా చూపించిన కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పూర్తిగా వదిలించుకోవాలని చూస్తోంది. అమ్మేయడానికి సిద్ధపడుతోంది.
నిజానికి 2015 వరకూ పరిస్థితి బానే ఉంది. కానీ ఉక్కు పరిశ్రమలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు, ఐరన్ ఓర్ ప్రైవేటుగా కొనుగోలు చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. 2015-16 నుంచి 2020 మధ్య 5వేల కోట్లు వరకు నష్టం వచ్చిందని కేంద్రం అంటుంది. ప్లాంట్ ఆధునికీకరణ, విస్తరణ చేపట్టడం వలన కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.
దేశంలో స్టీల్‌కు డిమాండు పెరుగుతుండటంతో భవిష్యత్తులో మళ్లీ లాభాల బాటపట్టే అవకాశం ఉంది. కానీ సరిగ్గా ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధమైంది. సమస్యకు పరిష్కారం చూపించాల్సింది పోయి సంస్థను అమ్మేస్తామనడం సరికాదని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అంటున్నారు .
తెలుగు ప్రజల త్యాగాలతో ఏర్పడ్డ సంస్థ
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆంధ్రులు చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు. 1971లో ఈ సంస్థ కోసం 64 గ్రామాల నుంచి దాదాపు 26 వేల ఎకరాల భూమి సేకరించారు. కురుపాం జమీందార్ 6వేల ఎకరాలు విరాళంగా ప్రకటించారు. ఆ భూములు ఇచ్చిన కుటుంబాల్లో సగం మందికే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వగలిగారు. అయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే అది అందరిదీ అనే అభిప్రాయంతో ప్రజలు సర్దుకుపోయారు. ప్రతీ ఏటా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి టాక్స్‌ల రూపంలో వేలకోట్లు కేంద్ర ప్రభుత్వానికి చేరుతున్నాయి. అయినప్పటికీ నష్టాల వంక చూపి స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని కేంద్రం చూస్తుంది .
స్టీల్ ప్లాంట్ భూముల కోసమే ప్రైవేటీకరణ!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం దానికి ఉన్న భూములే అంటారు ఇక్కడి కార్మికులు. ప్లాంట్ విస్తరణ, భవనాల నిర్మాణం పోగా ఇంకా 8 వేల ఎకరాల భూమి ఖాళీగా ఉంది. దాన్ని చేజిక్కించుకునేందుకే ప్రైవేటు కంపెనీలు స్టీల్ ప్లాంట్‌పై కన్నేసాయనేది వారి వాదన. వీటి విలువ దాదాపు లక్ష కోట్ల వరకూ ఉండడంతో వాటిపై ఆధిపత్యం కోసమే ఈ కుట్ర జరుగుతుందని వాళ్ల అనుమానం.
ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనాలని వచ్చిన పోస్కో కంపెనీ గతంలో ఒడిశాలో ప్లాంట్ కోసం ప్రయత్నిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మరి అదే కంపెనీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ఎలా అప్పగిస్తారని కేంద్రాన్ని అడిగితే మాత్రం జవాబు లేదని ఉద్యోగ కార్మిక సంఘాలు అంటున్నాయి.
32 మంది ప్రాణ త్యాగం ఫలితం స్టీల్ ప్లాంట్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక ప్రాంతానికి చెందినది కాదు. దీని ఏర్పాటు కోసం ఆంధ్రులంతా ఏకతాటిపై పోరాటం చేశారు. 1966లో గుంటూరు ప్రాంతానికి చెందిన టి.అమృతరావు విశాఖలో దీక్ష ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో దీనిలో పాల్గొన్నారు. తరగతుల బహిష్కరణ, ఆందోళనలతో నిరసనలు పెద్ద ఎత్తున సాగాయి. రాజకీయ పక్షాలు కూడా విద్యార్థులకు మద్దతుగా నిలిచాయి. 1966 నవంబర్ 1వ తేదీన విశాఖపట్నంలో విద్యార్థులు చేపట్టిన భారీ ర్యాలీ చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో 9 మంది మరణించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి. అక్కడ కూడా పోలీసు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అదిలాబాద్, వరంగల్, విజయవాడ, విజయనగరం, తగరపువలస, కాకినాడ, సీలేరు, గుంటూరులో మొత్తం 23 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా తెలుగువారి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పుతామంటే ఊరుకునేది లేదంటున్నారు ఉద్యోగులు. అందుకే ఈ ఉద్యమం మొదలు పెట్టామని స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి
ఈ ఏడాది లాభాల బాట పట్టిన సంస్థ
ఒక ప్రక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే మరోవైపు స్టీల్ ప్లాంట్‌ను ఈ ఏడాది లాభాల బాట పట్టించారు సంస్థ ఉద్యోగులు. గతంతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉక్కుకు డిమాండ్ పెరగడంతోపాటు, విశాఖ ఉక్కుకు నాణ్యతపరంగా దేశ విదేశాల్లో మంచిపేరు ఉంది. ఇప్పటికే 57 కంపెనీలతో స్టీల్ అమ్మకంపై ఒప్పందాలు కూర్చుకుంది. వాటిలో 30కిపైగా పూర్తి మొత్తం అడ్వాన్స్ గా తీసుకుని స్టీల్ ను ఉత్పత్తి చేస్తోంది. ఈ దెబ్బకు మళ్ళీ లాభాల బాట పట్టింది సంస్థ.
New Milestone Achievement 👏 !! Continuing its legacy of operational excellence, #RINL Vizagsteel has first time crossed Hot Metal production of 6 Million ton(Mt) in a calendar year, achieving 6.10 Mt of Hot Metal in 2021.#RINLPRODT pic.twitter.com/C688N939fr
— RINL (@RINL_VSP) January 3, 2022
యాజమాన్య అధికార లెక్కల ప్రకారమే 2021లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ 18వేల కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడ్డాక ఈ స్థాయి గణాంకాలు నమోదు చెయ్యడం ఇది రెండోసారి. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ 13శాతం వృద్ధి నమోదు చేసింది. చివరి నాలుగు నెలల్లో 740 కోట్ల రూపాయల నికర లాభం నమోదైంది. మార్చిలో 7 లక్షల 11 వేల టన్నుల ఉక్కును 3 వేల 300 కోట్ల రూపాయలకు విక్రయించారు. గత మార్చిలో అయితే కర్మాగారం చరిత్రలో అత్యధిక ఆదాయం వచ్చింది. గత గరిష్టంతో పోల్చుకుంటే ఇది 42శాతం అధికం. దీంతో ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ నమోదు చేస్తున్న లాభాలను దృష్టిలో పెట్టుకునైనా ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నియమించిన కమిటీ ఈ అంశాలను పరిగణనలోనికి తీసుకుంటుందని వారు భావిస్తున్నారు .
👏👏Tiding over Pandemic crisis #RINL Surpasses previous Annual Best Sales Turnover in FY22 .
— RINL (@RINL_VSP) February 3, 2022
In FY22 till JAN(10 months), RINL achieved Cumulative Sales T.O of Rs 22228 Cr surpassing the previous best Annual T.O of Rs 20844 Cr in FY19
In FY22(Jan)cumulative Sales Vol. 4272201MT pic.twitter.com/Vdt7Z6hI3R
దిల్లీ రైతు ఉద్యమం స్పూర్తితో పోరాటం
మొదట్లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఉద్యమం నెమ్మదిగా మొదలైనా తర్వాత అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల మద్దతు వీరికి ఉంది. ప్రారంభంలో ఆచితూచి వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఫుల్ సపోర్ట్ చేస్తోంది. అమ్మకాన్ని అడ్డుకుంటామని, అవసరమైతే కేంద్రం నుంచి తామే కొంటామని హామీ ఇచ్చింది. త్వరలోనే శుభ వార్త వింటారని కూడా చెప్పింది.
ప్రతిపక్ష టీడీపీ కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అయితే ఏకంగా రాజీనామా వరకూ వెళ్లారు. జనసేన, వామపక్షాలు కూడా ఈ అంశంలో కార్మికుల ఉద్యమానికి సపోర్ట్ ఇస్తూనే ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ చెయ్యక తప్పదు అంటూ చెబుతుంది. అయినప్పటికీ జీవీఎల్ నరసింహారావు లాంటి బీజేపీ ఎంపీలు మాత్రం మంచే జరుగుతుంది అంటున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ అమ్మకం వ్యవహారంలో అంతర్గతంగా ఏదో జరుగుతుందన్న చర్చ నడుస్తోంది. ప్రైవేటీకరణను ఆపొచ్చు అన్న ఆశాభవంలో ఉన్నారు.
ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకూ ఉద్యోగుల్లో సగం మంది విధుల్లో ఉంటే మరికొంతమంది స్టీల్ ప్లాంట్ ముఖ ద్వారం వద్ద ధర్నాలు చేస్తున్నారు. ఇలా ఏడాది పొడువునా ఎన్ని కష్టాలు ఎదురైనా వారు తమ దీక్షను మాత్రం వదిలి పెట్టలేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తమ పట్టు వీడక పొతే మాత్రం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామంటున్నారు. దిల్లీలో రైతు ఉద్యమం విజయవంతమైనట్టుగానే తమ పోరాటం కూడా సక్సెస్ అవుతుందంటున్నారు.
#RINL is proud to be associated with this prestigious #KanpurMetro project by supplying quality #Vizagsteel during constructions. https://t.co/KJQBht0fRQ pic.twitter.com/giGNlptRan
— RINL (@RINL_VSP) December 28, 2021