Visakha MLC By-Election: విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో పోటీకి కూటమి దూరం- బొత్స గెలుపు లాంఛనమే
Botsa Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో కూటమి పార్టీలు పోటీ చేయకూడదని నిర్ణయించాయి. నామినేషన్ పర్వం ముగియడానికి కొన్ని గంటల ముందు ఈ ప్రకటన చేశాయి.
Vizag MLC By-Election: విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం ఖాయమైంది. కూటమి పార్టీలు పోటీ చేయకూడదని నిర్ణయించడంతో వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. నిన్నటి వరకు పలు రకాలుగా కసరత్తులు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, చివరికి పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చేశారు. నామినేషన్ చివరి రోజున ఈ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో బొత్స గెలుపు ఖరారైంది. బొత్సాతోపాటు ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. షేక్ షఫీ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ ఉప సంహరించుకుంటే బొత్స గెలుపు ఏకగ్రీవం అయినట్టే... అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇది వైసీపీకి దక్కిన ఊరటగా చెప్పవచ్చు.
విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆచితూచి వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా నాయకులందరితో సంప్రదించి బొత్స పేరును ఖరారు చేశారు. కానీ కూటమి మాత్రం మొదటి నుంచీ పోటీ చేయాలా వద్దా అనే విషయంపై తర్జన భర్జనలు పడింది. దీనిపై సీఎం చంద్రబాబు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల బాధ్యతలను అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు అప్పగించారు. మొదటగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జి, పీలా గోవింద్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి.
పారిశ్రామికవేత్త బైరా దిలీప్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ పొత్తులో భాగంగా బీజేపీ సీటు కేటాయించడంతో సీఎం రమేశ్ విజయం కోసం పనిచేశారు. అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపించారు. విశాఖ జిల్లా నాయకులు సైతం దిలీప్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. దిలీప్‌కు చిరంజీవి ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో దాదాపు ఆయన అభ్యర్థి అవుతారని అంతా భావించారు. బలాబలాలు చూసుకున్న తర్వాత వైసీపీ తరఫున మెజార్టీ ప్రజాప్రతినిధులు గెలిచి ఉన్నందున గెలిచినా లేనిపోని ఆరోపణలు వస్తాయన్న ఆలోచనతో పోటీ చేయకూడదని నిర్ణయించారు. నామినేషన్‌కు కొన్ని గంటల ముందు ఈ విషయాన్ని తెలియజేశారు.
బలం లేదనే వెనకడుగు..
విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లున్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 36 మంది, కార్పొరేటర్లు 97 మంది, కౌన్సిలర్లు 53 మంది, మరో 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. వైసీపీ నుంచి ఎక్స్ ఆఫీషియో కింద ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200కుపైగా ఓట్లున్నాయి. వైసీపీకి 543కుపైగా ఓట్లు ఉన్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి. బలం లేకుండా పోటీ చేసి ఓటమి పాలైతే అనవసరంగా వైసీపీకి మైలేజ్ ఇచ్చినట్టవుతుందని కొందరు వారించారు. కొంతమంది మాత్రం పోటీ చేస్తే గెలవొచ్చని చంద్రబాబుకి సలహా ఇచ్చారు.
కూటమి నుంచి పోటీ ఉంటుందని మొదటి నుంచి వస్తున్న పీలర్లతో వైసీపీ జాగ్రత్త పడింది. అందుకు అనుగుణంగా పనులు మొదలుపెట్టింది వైసీపీ. వైఎస్ జగన్ పలుమార్లు ఎంపీటీసీలు, జెడ్పీటీడీసీలతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో ఇవాళ కూడా సమావేశం కానున్నారు. అసలే ఇటీవలే జరిగిన గ్రేటర్ విశాఖ స్థాయీ సంఘం ఎన్నికల్లో పరాజయం తర్వాత వైసీపీ అలెర్ట్ అయ్యింది. ఇప్పటికే కొంతమందిని క్యాంపులకు తరలించి ముందు జాగ్రత్తలు తీసుకుంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న చంద్రబాబు, పోటీ చేయకపోవడమే బెటరనే నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. బలం లేకుండా పోటీ చేసినప్పుడు ఫలితం ఎలా వచ్చినా నష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.