Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి
పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలిఏపీ మృతుని కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియాప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి అమర్నాథ్
ఒడిశా రాష్ట్రంలోని బహనగ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ఆదివారం (జూన్ 4) ఉదయం ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో దెబ్బతిన్న మూడు ట్రాక్ ల పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుంది అని అధికారులను ప్రశ్నించగా, ఆదివారం సాయంత్రానికి ఒక ట్రాక్ అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. ఘటనా స్థలంలో ట్రాక్ మరమ్మతు తదితర కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్న సిబ్బందికి, అధికారులకు స్థానికులు అందిస్తున్న సహకారాన్ని చూసిన మంత్రి అమర్నాథ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదొక విషాదకరమైన సంఘటనని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇక్కడ జరిగిన రైలు ప్రమాదంలో మానవ తప్పిదం కచ్చితంగా ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డిజిటలైజేషన్ పురోగతిలో ఉన్న నేపథ్యంలో ఇటువంటి ప్రమాదాలు జరగటం దురదృష్టకరమని అన్నారు. భారతీయ రైల్వే వందే భారత్ వంటి అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్న సమయంలో ఇంత ఘోర ప్రమాదాన్ని నివారించడంలో రైల్వే శాఖ ఎలా విఫలమైందని అమర్నాథ్ ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించడం ద్వారా, ప్రజల్లో భారతీయ రైల్వే పై నమ్మకం సడలిపోకుండా చూడాలని ఆయన కోరారు.
కాగా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గురుమూర్తి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని, అలాగే క్షతగాత్రులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు.