Janasena News: విశాఖ కోర్టులో జనసైనికులకు ఊరట! 61 మందికి బెయిల్, 9 మందికి రిమాండ్
విశాఖలోని ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు 71 మందిని పోలీసులు హాజరు పర్చారు. వీరిలో 61 మందికి 10 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
విశాఖపట్నం కోర్టులో జనసేన నాయకులకు ఊరట లభించింది. విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రులపై దాడి చేసిన ఘటనలో 92 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఆదివారం రాత్రి విశాఖలోని ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు 71 మందిని పోలీసులు హాజరు పర్చారు. వీరిలో 62 మందికి 10 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఏ - 1, ఏ - 9 నిందితులపై ఉన్న హత్యాయత్నం సెక్షన్‌ను తీవ్ర గాయం కేసుగా మార్చారు. అంటే సెక్షన్ 307 ను తొలగించి సెక్షన్ 326 గా మార్చారు. వీరికి మాత్రం రిమాండ్ విధించారు. మొత్తం తొమ్మిది మంది జనసేన నాయకులకు రిమాండ్ విధించారు. ఈనెల 28 వరకు వీరు రిమాండ్ లో ఉండనున్నారు. దీంతో పోలీసులు రిమాండ్ విధించిన కోన తాతారావు, సుందరపు విజయ్ కుమార్, మూర్తి యాదవ్, సందీప్, శ్రీనివాస పట్నాయక్, కృష్ణ, రూప, శ్రీనును కోర్టు నుంచి సెంట్రల్ జైల్ కు తరలించారు.
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు దాదాపు 92 మంది జనసేన సైనికులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు, విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం (అక్టోబరు 16) బస చేసిన నోవాటెల్ హోటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆ హోటల్ వద్దకు భారీ ఎత్తున జనసేన నేతలు కార్యకర్తలు, పవన్ అభిమానులు చేరుకున్నారు. దీంతో నోవాటెల్ హోటల్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. హోటల్ ఎదుట జన సైనికులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శనివారం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మంత్రుల వాహనాలపై దాడి ఘటనపై జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
రాత్రికి విశాఖలోనే పవన్
విశాఖలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉందని నగరంలో ర్యాలీలు, బహిరంగ సభలు, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకూడదని పోలీసులు పవన్ కల్యాణ్ కు నోటీసులు అందజేశారు. జనసేన జనవాణి కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. అయితే సంబంధం లేని కేసులో 28 మంది జనసేన నేతలు అరెస్టు చేశారని పవన్ ఆరోపించారు. అరెస్టైన వారిని విడుదల చేసే వరకు విశాఖను విడిచి వెళ్లనని పవన్ పట్టుపట్టారు. దీంతో ఆ రాత్రికి ఆయన అక్కడే ఉండిపోయారు.
వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు
విశాఖ నోవాటల్ లో బసచేసిన పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున హోటల్ ముందు బీచ్ రోడ్డు వద్ద నిరీక్షిస్తున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలకు, తన అభిమానులకు ఎటువంటి అల్లర్లకు పాల్పడద్దని పవన్ కోరారు. మరోవైపు హోటల్ వైపు ప్రజలు రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. హోటల్ అద్దాల నుంచి పవన్ కళ్యాణ్ తన అభిమానులకు స్పందించడం తప్ప బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. హోటల్ ఉన్న పవన్ వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఆర్కే బీచ్ లో వాకింగ్ చేయాలని ఉంది అందుకు పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదో అంటూ ట్వీట్ చేశారు.