బ్రిటీషర్లపై అల్లూరి సీతారామరాజు తొలి దాడి జరిపి వందేళ్లు!
2022 ఆగస్టు నెలకు చాలా ప్రత్యేకతలున్నాయి. స్వతంత్ర వజ్రోత్సవాలతో పాటు బ్రిటీషర్లపై అల్లూరి సీతారామరాజు తొలి దాడి జరిపి వందేళ్లు అవుతోంది.
2022 సంవత్సరానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవడమే కాకుండా... మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు తన రంప విప్లవం మొదలు పెట్టి కూడా 100 ఏళ్ళు అయింది. 1922 ఆగస్టు నెలలోనే ఆయన తన తొలి దాడిని మొదలు పెట్టారు. గిరిజనులపై బ్రిటీషు వాళ్లతో పాటు.. వాళ్ల తొత్తులుగా మారిన కొందరు స్వదేశీయల చెలాయిస్తున్న పెత్తనాన్ని, చేస్తున్న దోపిడీని నిరసిస్తూ ఉద్యమంలోకి దిగి సరిగ్గా 100 సంవత్సరాలు అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం రంప ఉద్యమానికి 100 ఏళ్ళు అంటూ అల్లూరినీ.. ఆయన అనుచరుల త్యాగాలనూ స్మరించుకుంది. 100 ఏళ్ల క్రితం చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడితో మొదలు.
మన్యంలోని గిరిజనులకు అండగా అల్లూరి..
విప్లవ ఉద్యమ రంగంలోకి దిగి సరిగ్గా 100 ఏళ్ళు గడిచాయి. మొదటి సారిగా ఆయన 22 ఆగస్టు 1922 న చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. 11 తుపాకులతోపాటు 14 బాయినెట్లు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్లను తీసుకుని వెళ్లిపోయారు. తిరిగి వస్తుండగా ఎదురు పడిన ఇద్దరు పోలీస్ అధికారుల ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అదొక దోపిడీలాగా కాకుండా దర్జాగా పోలీస్ రికార్డులో సంతకం చేసి మరీ ఆయుధాలను తీసుకువెళ్లారు. అంతవరకూ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అటువంటి వీరోచిత ఘటన చూడని గిరిజన ప్రజలు ఆ వార్త విని అల్లూరి ధైర్యానికి నీరాజనాలు పట్టారు. ఇక బ్రిటీష్ ప్రభుత్వం అయితే ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఎందుకంటే అంత వరకూ పోలీస్ స్టేషన్ పై దాడి అనేది ఆంధ్ర ప్రాంతంలో నమ్మశక్యం కాని ఘటన.
గిరిజన ప్రజలకు దైవంగా మారిన అల్లూరి..
వాళ్ళు ఆ షాక్ లో నుంచి తేరుకునేలోపే అల్లూరి సైన్యం వరుసగా కృష్ణాదేవిపేట.. రాజవొమ్మంగి స్టేషన్‌లపై దాడి జరిపింది. తరతరాలుగా తాము చేస్తున్న పోడు వ్యవసాయంపై బ్రిటీషర్లు విధించిన ఆంక్షల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న మన్యం ప్రజలకు అల్లూరి సీతారామరాజు దైవంగా మారాడు. అక్కడి నుంచి రెండేళ్లపాటు ఉద్ధృతంగా జరిగిన మన్యం విప్లవం ఆంగ్లేయులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ ఘటనలకు గుర్తుగా మన్యంలో అల్లూరి సీతారామరాజు మొట్టమొదటిసారి దాడి చేసిన చింతపల్లి స్టేషన్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడంతోపాటు మన్యం విప్లవం ప్రారంభమై 100 ఏళ్ళు పూర్తయిన సంబరాలు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అలాగే అల్లూరి సహచరులైన గాము దొరల వారసులకు ఇళ్ల పట్టాలను సైతం ఇచ్చారు.
ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్న చింతపల్లి పోలీస్ స్టేషన్..
100 ఏళ్ల నాటి చరిత్రకు ఆనవాలుగా నిలిచిన చింతపల్లి పోలీస్ స్టేషన్ ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. దీనికి కొంత మరమ్మత్తులు చేసి సబ్ ట్రెజరీ ఆఫీసుగా వాడుతున్నారు. అయితే దీనిని మరికొంత ఆధునీకరించాల్సిన అవసరం అయితే ఉందని స్థానికులు చెబుతున్నారు. మరి ఈ 100 ఏళ్ల సంబరాల సందర్బంగానైనా ప్రభుత్వ అధికారులు ఆ పని చేస్తారేమో చూడాలి.