Independence Day 2022: 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే 75 ఏళ్లుగా మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది
ఆగస్టు 15 అనగానే భారత స్వాతంత్య్ర దినోత్సవం అందరికీ గుర్తొస్తుంది. ఆరోజు దేశ వ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటాం.
ఆగస్టు 15వ తేదీకి వైజాగ్ కలెక్టర్ కార్యాలయ భవనానికి విచిత్రమైన సంబంధం ఉంది. ఆగస్టు 15 అనగానే భారత స్వాతంత్య్ర దినోత్సవం అందరికీ గుర్తొస్తుంది. ఆరోజు దేశ వ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటాం. అయితే 1947కు ముందు ఆ తేదీకి పెద్దగా ప్రాధాన్యత ఏమీ లేదు. కానీ వైజాగ్ కలెక్టరేట్ బిల్డింగ్ కి మాత్రం ఆ డేట్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే స్వాతంత్య్రం రావడానికి 34 ఏళ్ల ముందు ఆగస్టు 15 వ తేదీన వైజాగ్ కలెక్టరేట్ బిల్డింగ్ ప్రారంభమైంది. అంటే 34 ఏళ్లపాటు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే భారత జాతీయ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది.
చూడగానే రాజుల కోట లా కనపడే వైజాగ్ కలెక్టరేట్
వైజాగ్ కు కొత్తగా వచ్చిన వారెవరైనా సడన్ గా చూస్తే వైజాగ్ కలెక్టరేట్ బిల్డింగ్ ని రాజుల కోట అని భావిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ భవనానికున్న రాజసం అలాంటిది. విశాఖపట్నం లోని కేజీహెచ్ హాస్పిటల్ కు ఎదురుగా ఉన్న ఈ భవనాన్ని 1865-1913ల మధ్య విడతలవారీగా నిర్మించారు. ఇంగ్లాడ్ కు చెందిన గ్యాసమ్ అండ్ డంకెల్లీ సంస్థ దీని నిర్మాణానికి ప్లాన్ గీసి ఇచ్చింది. నిజానికి దీనిని నిర్మించింది కూడా బ్రిటీష్ కాంట్రాక్టర్ లే అని భావించేవారున్నారు. అయితే వాళ్లు ఇచ్చిన ప్లాన్ ప్రకారం.. బ్రిటీషర్ల పర్యవేక్షణ లోనే ఈ భవనాన్ని స్థానిక భారతీయ కాంట్రాక్టర్లు నిర్మించారని చరిత్రకారులు ఎడ్వర్డ్ పాల్ చెబుతున్నారు. ఇంజనీరింగ్ వైచిత్రికి నిదర్శనంగా నిర్మితం కావడంతోపాటు ఇంగ్లాండ్ పేరు కూడా కలిసి వచ్చేలా " E " అనే ఆకారంలో కలెక్టరేట్ బిల్డింగ్ ని నిర్మించారనేది మరికొందరి భావన. భవనం లోని ఫ్లోరింగ్, హ్యాండ్ రెయిలింగ్ లను బర్మా టేకుతో నిర్మించారు. అవి ఇప్పటికీ అంతే స్ట్రాంగ్ గా ఉన్నాయి
కనిపించని శిలాఫలకాలు - చెన్నై లో దొరికిన ఆధారాలు
నిజానికి ఇలాంటి ప్రతిష్టాత్మక భవనాల నిర్మాణ సమయంలో అవి పూర్తయిన తేదీలు.. ప్రారంభించిన తారీఖులు శిలాఫలకాలుగా వేస్తుంటారు. అయితే వైజాగ్ కలెక్టరేట్ లో అటువంటి గుర్తులు ఏవీ లేకపోవడంతో చాలాకాలం భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలు దొరకలేదు. అయితే వైజాగ్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని పురాతన భవనాల వివరాలను.. చారిత్రిక ఆధారాలను సంపాదించే ఇంటాక్ట్ సంస్థ ప్రతినిధులు సాగించిన అన్వేషణలో చెన్నై లోని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఒక కీలక డాక్యుమెంట్ లభించింది. అది విశాఖలో కలెక్టరేట్ భవనం పూర్తి అయిందా లేదా అనేదానిపై పర్యవేక్షణకు మద్రాస్ నుంచి వచ్చిన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ బ్రిటీష్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక తాలూకూ డాక్యుమెంట్.
చెన్నైలో దొరికిన డాక్యుమెంట్ ప్రకారం 1913 ఆగస్టు నాటికి భవనం రెడీ అయింది అనీ ఆగస్టు 15 నుంచి కలెక్టరేట్ కార్యాలయ కార్యక్రమాలు ప్రారంభం చేశారని తెలుస్తోంది. దాంతో వైజాగ్ కలెక్టరేట్ చరిత్రకు సంబంధించిన చిక్కుముడి విడిపోయింది. అయితే ఈ మొత్తం చరిత్రలో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఆగస్టు 15 వ తేదీ. భారతదేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న రాగా సరిగ్గా దానికి 34 ఏళ్ల ముందు అదే ఆగస్టు 15న వైజాగ్ కలెక్టరేట్ ప్రారంభం కావడం. అప్పటివరకూ 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే గత 75 ఏళ్లుగా భారత జాతీయ పతాకం ఠీవిగా ఎగురుతోంది.
వందేళ్ల పాటు కలెక్టరేట్ భవనం లేకుండానే వైజాగ్ కలెక్టర్లు
దేశంలోనే అతిపెద్ద జిల్లాగా విజగపటం ఉండేది. అదే నేటి విశాఖ. 1803 లోనే వైజాగ్ కు మొదటి కలెక్టర్‌ను నియమించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే కలెక్టర్ కు సొంత భవనం లేకపోవడంతో వైజాగ్ లోని వివిధ ప్రాంతాల్లోని అద్దె బిల్డింగ్ ల్లో కలెక్టరేట్ ను నడిపేవారని చరిత్రకారులు చెబుతుంటారు. కొంతకాలం ప్రస్తుతం క్వీన్ మేరీ స్కూల్ ఉన్న ప్రాంతంనుండి కలెక్టర్ కార్యకలాపాలు సాగేవని చరిత్ర చెబుతోంది. 110 ఏళ్ల తరవాత 1913 లో బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యాక ఎల్టీ హారిస్ అనే అధికారి కలెక్టర్ గా ఈ బిల్డింగ్ ని ప్రారంభించారు. అప్పటినుంచి నిరాటంకంగా పనిచేస్తున్న వైజాగ్ కలెక్టరేట్ బిల్డింగ్ ఇప్పటికీ అంతే దృఢంగా ఉంది. ప్లాన్ గీసింది బ్రిటీషు వారైనా, కట్టింది మాత్రం భారత కాంట్రాక్టర్.