Global Investors Summit 2023: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ప్రారంభం, రాష్ట్ర గీతాలాపన - సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన
సదస్సు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గీతం అయిన ‘మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ..’ గీతాన్ని ఆలపించారు.
విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ప్రారంభం అయింది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణం 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు జరుగుతోంది. సదస్సు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గీతం అయిన ‘మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ..’ గీతాన్ని ఆలపించారు. ఆ సమయంలో వేదికపై సీఎం జగన్, ముఖేష్ అంబానీతో పాటు, కరణ్ ఆదానీ, జీఎంఆర్ సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. గీతాలాపన అనంతరం సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని, సంక్షేమం, డెవలప్ మెంట్ కు అధిక ప్రాధాన్యం ఇస్తూ సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ముందుందని ప్రసంగించారు.
అంతకుముందు ఆంధ్రా యూనివర్సిటీ స్థలంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరు అవుతున్న దిగ్గజాలకు సాంప్రదాయ రీతిలో ఆహ్వానం పలికారు. గిరిజన నృత్యాలు చేస్తూ అలరించారు.
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని, బిజినెస్ ఇండస్ట్రీపై సీఎం జగన్ మంచి దార్శనికతతో ఉన్నారని అన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ తొలి స్థానంలో ఉందని అన్నారు.