సీఎం జగన్ కు నమ్మకస్తులుగానే ఉంటాం, పార్టీకీ విధేయులే : గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ నమ్మకస్తులుగానే ఉంటాయమన్నారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.
Andhra Padesh Politics : ముఖ్యమంత్రి (Chief Minister) జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy ) ఎల్లప్పుడూ నమ్మకస్తులుగానే ఉంటాయమన్నారు గాజువాక (Gajuwaka) ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి (Tippala Nagireddy). తాను, తన కుమారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ(YSRCP)కి విధేయులుగా ఉంటామని, ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్, ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేయస్సు కోసం కంకణబద్దులై ఉంటామన్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని...అదే తమకు ముఖ్యమని వెల్లడించారు. తమ కుటుంబం మీద వస్తున్న పుకార్లను నమ్మవద్దని తిప్పల నాగిరెడ్డి కోరారు.
వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లాను : దేవన్ రెడ్డి
తన వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్తే రకరకాల పుకార్లు వచ్చాయన్నారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి. సొంత పనుల మీద బయటకు వెళ్లేముందు ఇన్ చార్జ్ వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడే వెళ్లినట్లు దేవన్ రెడ్డి తెలిపారు. అక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవని, నిన్న మళ్ళీ సిటీకి వచ్చే లోపు చాలా పుకార్లు వచ్చాయన్నారు. తండ్రి ఎమ్మెల్యేగా ఉండగా తానెందుకు పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. తాను పార్టీతోనే ఉన్నానన్న దేవన్ రెడ్డి... సుబ్బారెడ్డిని కలిసి వివరణ ఇచ్చారు. ఎప్పటికి ముఖ్యమంత్రి జగన్ మాటకి, పార్టీకి కట్టుబడి ఉంటామన్నారు. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తామని స్పష్టంచేశారు.
దేవన్ రెడ్డి రాజీనామా చేశారంటూ వార్తలు
గాజువాక వైసీపీ ఇన్‌ఛార్జి మార్పు కలకలం రేపింది. ఈ మార్పును ముందే పసిగట్టిన ప్రస్తుత ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమారుడు దేవన్‌రెడ్డి...సోమవారం తన పదవికి రాజీనామా చేశారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన పార్టీని వీడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పెదగంట్యాడలోని ఆయన నివాసానికి పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. దేవన్‌రెడ్డి సోదరుడు, 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధిల కొండా రాజీవ్ మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేయలేదని, ఇన్‌ఛార్జిగా అధిష్ఠానం ఎవర్నీ నియమించలేదని కేడర్ కు క్లారిటీ ఇచ్చారు. ఇలా హైడ్రామా కొనసాగుతుండగానే, కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి గాజువాక ఇన్‌ఛార్జిగా 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్రరావును నియమిస్తున్నట్లు లేఖ విడుదల అయింది. దీంతో అప్పటి వరకు రాజీనామా చేయడం లేదు, ఎవర్నీ ఇన్‌ఛార్జిగా నియమించడం లేదన్న వారికి గట్టి షాక్ తగిలినట్లైంది. వయసు, అనారోగ్య సమస్యల రీత్యా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు దేవన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని తిప్పల నాగిరెడ్డి పార్టీ అధిష్ఠానాన్ని అడిగినట్లు తెలుస్తోంది. టికెట్‌పై హామీ రాకపోవడంతో వైసీపీకి దేవన్‌రెడ్డి రాజీనామా చేసినట్లు వార్తలువచ్చాయి. తాజాగా సుబ్బారెడ్డిని కలవడంతో పుకార్లకు చెక్ పడింది.
11నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పు
11 నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుతో ఆ పార్టీ అసంతృప్తి భగ్గుమంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీకీ రాజీనామా చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ మార్పుల్లో ముగ్గురు మంత్రులకు స్థానచలనం కలిగింది. యర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్, చిలకలూరిపేటలో విడదల రజిని, వేమూరులో మేరుగు నాగార్జునపై వ్యతిరేకత ఉండటంతోనే మార్చినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.