(Source: ECI/ABP News/ABP Majha)
TDP News : తల్లి, చెల్లికి నిరాదరణ - వేరే పార్టీలపై ఏడుపు - జగన్‌పై టీడీపీ ఆగ్రహం!
Kala venkatrao : కుటుంబాన్ని చీలుస్తున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. జగన్‌కు కౌంటర్ ఇస్తూ టీడీపీ నేత కళా వెంకటరావు ఓ లేఖ విడుదల చేశారు.
Tdp Counter To Jagan : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ (Tdp ) సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు (Kala Venkatrao) కౌంటర్ ఇచ్చారు. నీ కుటుంబాన్ని వేరే వాళ్లు చీల్చారని నీ తల్లి విజయమ్మ (Vijayamma ), చెల్లి షర్మిల (Sharmila)తో చెప్పించగలవా ? అని సవాల్ చేశారు. నీ భార్య కుటుంబమే నీ కుటుంబం అన్నట్లుగా వ్యవహరిస్తున్నావని, రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశావంటూ మండిపడ్డారు. నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని, అక్రమంగా వేల కోట్లు సంపాదించావంటూ కళా వెంకట్రావు విమర్శించారు.
జైలుకు వెళితే షర్మిల పార్టీని నిలబెట్టారు !
అవినీతి కేసుల్లో అరెస్టయి జైలుకు వెళితే, నీ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల పాదయాత్ర చేశారని కళా వెంకట్రావు గుర్తు చేశారు. జైలుకు వెళ్లిన సమయంలో పాదయాత్రతో నీకు, నీ పార్టీకి కుటుంబానికి అండగా నిలిస్తే, అధికారంలోకి వచ్చాక షర్మిలను దూరంగా పెట్టావని జగన్ పై మండిపడ్డారు. అధికారాన్ని భార్య తరపున బంధువులకు అప్పగించి న్యాయబద్ధంగా ఆస్తిలో వాటా ఇవ్వకుండా, చెల్లిని తెలంగాణలో రోడ్ల మీద తిరిగేలా చేశావంటూ కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ వివేకానందరెడ్డిని అంతమొందించిన...నీ భార్య కుటుంబానికి కొమ్ము కాస్తున్నావంటూ విమర్శించారు.
వైఎస్ భార్య ఇప్పుడు ఎలా ఉందో అందరూ చూస్తున్నారు !
వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి, అల్లుడిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నావని, రాజశేఖర్ రెడ్డి భార్య ప్రస్తుతం ఎలా ఉందో ప్రజలంతా చూస్తున్నారంటూ లేఖలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ తన కుటుంబాన్ని ఇతర పార్టీల నేతలు చీలుస్తున్నారంటూ మాట్లాడటంపై చంద్రబాబు కూడా మండిపడ్డారు. తల్లి, చెల్లిని సరిగ్గా చూసుకోకుండా.. తమపై బురద చల్లి రాజకీయం చేయడమేమిటని చంద్రబాబు మండిపడ్డారు.
కుటుంబాన్ని చీలుస్తున్నారని జగన్ విమర్శలు
రాబోయే రోజుల్లో కుట్రలు, కుటుంబాల్ని చీల్చే రాజకీయాలు చేస్తారని సీఎం జగన్ ఆరోపణలు చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన పెన్షన్ కానుక బహిరంగసభలో మాట్లాడిన జగన్....తెలుగుదేశం, జనసేనను లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. భవిష్యత్ లో మరిన్ని పొత్తులు పెట్టుకుంటారని ఆరోపించారు. పొత్తుల కోసం కుటుంబాలను చీలుస్తారని మండిపడ్డారు. షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు సిద్దమైన సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం వైసీపీలో కలకలం రేపుతోంది. చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారని, పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదన్నారు. పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదన్న జగన్.... చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్‌నరే అన్న జగన్, అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారని, చంద్రబాబు అవినీతిలో పార్ట్‌నర్ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడని విమర్శించారు. 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామని.. పెన్షన్‌ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.