CPI Ramakrishna: ‘బెయిల్‌పై ఉన్న సీఎం భవిష్యత్ ఏంటో ఆయనకే తెలీదు, జగనన్నే మా నమ్మకమంటూ స్టిక్కర్లా'
Andhra Pradesh: విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మే 3న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
విశాఖపట్నం: బెయిల్ మీద ఉన్న ఏపీ సీఎం జగన్ భవిష్యత్ ఏంటో ఆయనకే తెలియదు కానీ.. జగనన్నే మా భవిష్యత్ అంటూ ఇంటింటికి స్టిక్కర్లు అతికించడం ఏంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. మే 9 నుంచి జగనన్నకు చెపుదాం అనే కొత్త కార్యక్రమాన్ని పెట్టబోతున్నారని, ప్రజలను ఇంటికి రానివ్వను, తాను ఆఫీసుకు పోను అనే సీఎంను తాను ఎక్కడా చూడలేదని రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటివరకు ఒక్క ఆర్జీ తీసుకున్నది లేదని, మీడియా సమావేశం పెట్టలేదని, అఖిలపక్ష భేటీ సైతం ఏర్పాటు చేయలేదని అన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి అవకాశమే ఇవ్వకపోతే ఎలా చెప్పుకుంటారని రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంటింటికి జగనన్నే మా నమ్మకం అంటూ స్టిక్కర్లు అంటిస్తున్నారని, నీ భవిష్యత్ ఏంటో నీకే తెలియదు, బెయిల్ మీద బయటకొచ్చావు, అది రద్దయితే ఏ క్షణంలో ఎక్కడ ఉంటావో కూడా తెలియదు అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి సీపీఐ నేత రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మే 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో
విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మే 3 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో చేస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. విశాఖపట్నంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. ఉక్కు పరిరక్షణ పోరాటం నేడు 808 రోజుకు చేరుకుందని రామకృష్ణ వెల్లడించారు. ప్రైవేట్ ఉక్కు పరిశ్రమలకు ఐరన్ ఓర్ మైన్స్ కేటాయిస్తుంటే, ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వడానికి ఏం అడ్డు వచ్చాయని ఆర్కే ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వర్కింగ్ కేపిటల్, కేపిటివ్ మైన్స్ ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని రామకృష్ణ నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు 50 వేల కోట్ల రూపాయలు వివిధ రూపల్లో సర్కారుకు చెల్లించిందని ఆర్కే తెలిపారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తులున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబు, మోదీ విధానాలని వ్యతిరేకించక తప్పదు
వైజాగ్ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలపై ఈరోజు ఇప్పటికిప్పుడు అఖిల పక్ష సమావేశం నిర్వహించిన తాము వస్తామని సీపీఐ నేత రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ క్లారిటీతో ఉన్నారని, ఉక్కు కర్మాగారాన్ని, విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పారని, చెప్పినట్లుగానే చేస్తున్నారని ఆర్కే అన్నారు. చంద్రబాబు, మోదీ విధానాలని వ్యతిరేకించక తప్పదని పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలైతే రాజకీయాల్లో మార్పులు తథ్యమని ఆయన పేర్కొన్నారు. అదానీ డేటా సెంటర్ కు బాబు ఒకసారి శంకుస్థాపన చేశారని, ఇప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత సీఎం జగన్ మరోసారి శంకుస్థాపన చేయడం ఎన్నికల ఎత్తుగడగా రామకృష్ణ పేర్కొన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకసారి, చంద్రబాబు నాయుకు ఒకసారి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు సార్లు శంకుస్థాపన చేశారని రామకృష్ణ ఎద్దేవా చేశారు. శంకుస్థాపనలు చేయడం కాదని, ప్రారంభోత్సవాలు చేయాలని ఆర్కే సూచించారు.