Araku News: ఉత్తరాంధ్రలో తొలి అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు, అరకులో ఆయనకే ఛాన్స్
Chandrababu Naidu: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున దొన్ను దొర పోటీ చేస్తారని స్పష్టం చేశారు.
Chandrababu First Candidate: రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. మరో పక్క వైసీపీ అధినేత జగన్, జనసేనాని కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపికపైనా దృష్టి సారించాయి. ఇప్పటికే పలు విడతల్లో అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించగా, తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఆ దిశగా సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలోనే అరకు బహిరంగ సభకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో తొలి అభ్యర్థిని ప్రకటించారు. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున దొన్ను దొర పోటీ చేస్తారని స్పష్టం చేశారు. దీంతో ఉత్తరాంధ్రలో ఉన్న మొత్తం 34 నియోజకవర్గాల్లో ఇక్కడి నుంచే తొలి అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించడం విశేషం.
మెజార్టీ స్థానాలపై దృష్టి
తెలుగుదేశం పార్టీ ఏజెన్సీ ప్రాంతాల్లో వెనుకబడి ఉంటోంది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కంచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. గడిచిన ఎన్నికల్లో అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలతోపాటు అరకు ఎంపీ స్థానాన్ని వైసీపీ కైవశం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బలంగా ఉన్న అభ్యర్థులను బరిలోకి దించాలని భావించిన చంద్రబాబు స్థానికంగా పేరున్న వ్యక్తులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో టీచర్‌గా పని చేసి రాజకీయాల్లోకి వచ్చిన దొన్ను దొరను అరకు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నిర్ణయం పార్టీకి మేలు చేస్తుందని కేడర్ భావిస్తోంది. ఇప్పటి వరకు పార్టీకి పని చేసిన శ్రావణ్‌కుమార్, అబ్రహంలకు సముచిత స్థానాన్ని కల్పిస్తామని చంద్రబాబు వేదికపై నుంచి హామీ ఇవ్వడంతో వారి అభిమానుల్లోనూ ఉత్సాహం కనిపించింది.
వారం రోజుల్లో అభ్యర్థులపై స్పష్టత..
ఉత్తరాంధ్రలోని మెజార్టీ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒక స్పష్టతకు వచ్చారు. కొన్ని చోట్ల పోటీ ఉండడంతో అక్కడ సర్వేలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళంలో రెండు, విజయనగరంలో మరో రెండు, ఉమ్మడి విశాఖలో మూడు స్థానాల్లో పోటీ నెలకొంది. ఇక్కడ సీనియర్లకు కొత్తగా వచ్చిన నాయకుల నుంచి పోటీ ఉండడంతో ఎవరికి కేటాయించాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. వీటిపై స్పష్టత వచ్చాక అభ్యర్థులు ప్రకటన ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.