Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Andhra Pradesh : భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం.
Bhogapuram Airport construction is going on at a fast pace : ఉత్తరాంధ్ర అభివృద్దికి మేలి మలుపుగా ఉంటుందని అంచనాలు వేస్తున్న బోగాపురం ఎయిర్ పోర్టు నలబై శాతానికి పూర్తయింది. మూడు నెలల కిందటి వరకూ బోగాపురం ఎయిర్ పోర్టు ప్రాంతంలో అంతా నిర్మానుష్యంగా కనిపించేది. అక్కడక్కడా లేపిన పునాదులే కనిపించేవి. కానీ ఇప్పుడు నలభై శాతం పనులు పూర్తయిపోయాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ .. ఏటీసీ కూడా దాదాపుగా పూర్తవ్వొచ్చింది. టర్మినల్ నిర్మాణం జరుగుతోంది. సమాంతరంగా రన్ వే నిర్మాణం జరుగుతోంది. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనుల్ని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. వందల మంది.. శరవేగంగా పని చేస్తున్నారు. నిర్దేశించుకున్న గడువు కన్నా ముందుగానే.. ఈ ఎయిర్ పోర్టు ఆపరేషన్ లోకి రానుంది.
అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు
బోగాపురం ఎయిర్‌పోర్టుకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. మన్యం వీరుడికి సరైన నివాళి అర్పించినట్లవుతుందని అంటున్నారు. ఎయిర్ పోర్టు తొలి దశ నిర్మాణ పనుల్లో ఎయిర్ స్పేస్, ఎడ్యుకేషన్ జోన్, హెల్త్‌కేర్ జోన్, ఎయిర్ సిటీ, ఇండస్ట్రియల్ జోన్ ఉన్నాయి. 3.8 కిలోమీటర్ల మేర రెండు రన్ వేలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రన్‌వేకు ఒక రూపు తీసుకొచ్చారు. టాక్సీవే, యాప్రాన్, ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ పనుల చివరి దశకు వస్తున్నాయి.
✈ Bhogapuram International Airport update 👇
— Andhra Nexus (@AndhraNexus) September 18, 2024
41% works are completed
Phase 1
🔹️Cost : 4,502 crores
🔹️Area : 2,203 acres
➡️ GMR developing Industrial zone, Education zone, Healthcare zone, Hospitality zone, Aero city, MRO facility, in Phase 1.#Visakhapatnam pic.twitter.com/qY3RNFjW1d
నీటి కోసం ప్రత్యేకంగా జలాశయ నిర్మాణం
ఎయిర్ పోర్టుకు అవసరమయ్యే నీటి కోసం తారకరామ తీర్థ సాగర్ నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు కానీ ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. ఎయిర్ పోర్టును వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. ముందుగా జలాశయ నిర్మాణం జరుగుతోంది. ఎయిర్ పోర్టును 2026 డిసెంబర్ కు పూర్తి చేయాలని ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నారు. అందుకే ఆరు నెలల ముందుగానే పూర్తి చేయడానికి వర్క్ ఏజెన్సీలు సిద్ధమయ్యాయి.
వ్యక్తిగతంగా టార్గెట్ గా పెట్టుకున్న మంత్రి రామ్మోహన్ నాయుడు
కేంద్ర పౌర విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటం బాగా కలిసి వస్తుంది. ఆయన ప్రతి వారం.. ప్రతి నెలా పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. మంత్రిత్వ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్ పోర్టు రద్దీగా మారుతోంది. పైగా అది ఎయిర్ ఫోర్స్ కు చెందినది. రాత్రి పూట విమానాలు దిగడంపై ఆంక్షలు ఉన్నాయి. విశాఖ ఓ మెట్రోసిటీగా మారడానికి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అత్యంత ముఖ్యమని భావించి.. రాష్ట్రం విడిపోయిన తర్వాత బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంకల్పించారు. అయితే అప్పుడు అనుకున్నది.. పదేళ్ల తర్వాత వేగం పుంజుకుంది. మరో ఏడాది.. ఏడాదిన్నరలో ఎయిర్ పోర్టు ప్రారంభమవుతుంది. బోగాపురం కూడా మరో శంషాబాద్ లా అభివద్ది చెందుతుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.