Asani Cyclone Effect: వాయుగుండంగా మారిన అసని- కోస్త, రాయలసీమకు వర్ష సూచన
వాయుగుండంగా మారిన అసని ప్రభావం కోస్తా, రాయలసీమపై ఉంది. భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖాధికారులు..
ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతున్నట్టు ఐఎండీ ప్రకటించింది. ఇది ఈశాన్యం దిశగా కదులుతున్నట్టు పేర్కొంది వాతావరణ శాఖ.
ప్రస్తుతం గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ వాయుగుండం కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉంది. నిన్న ప్రకటించిన రెడ్ అలెర్ట్ ఇంకా కొనసాగుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది.
50-60 కిలోమీటర్ల మేర గాలులు వీచే అవకాశం ఉంది. ఇది క్రమంగా తగ్గి 45 నుంచి 55 కిలోమీటర్ల వరకు గాలి వీయొచ్చు. కృష్ణ, తూర్పు, పశ్చిమగోదావరి, యానం గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంటుందని.. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు వాతావరణ శాఖ సూచిస్తోంది. వాయుగుండం కారణంగా కురిసే వర్షాలకు, గాలులకు కృష్ణ, గోదావరి, యానంలో ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.