Sharmila Letter to AP DGP: తన భద్రతపై ఆందోళన, సెక్యూరిటీ పెంచాలని ఏపీ డీజీపీకి షర్మిల లేఖ
AP PCC Chief Sharmila Security: రాజకీయంగా జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి బుధవారం లేఖ రాశారు.
AP Pcc President Sharmila Reddy: రాజకీయంగా జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి బుధవారం లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ భద్రతను ఫోర్ ప్లస్ ఫోర్‌కు పెంచాలని, పోలీస్ ఎస్కార్ వెహికల్‌ను కేటాయించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై సానుకూలంగా స్పందించి తగిన భద్రతను కేటాయించాల్సిందిగా ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి (AP Congress Chief)గా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రమంతటా పర్యటించాల్సి ఉండడం, వచ్చే ఎన్నికల వాతావరణం నేపథ్యంలో తగిన భద్రతను కల్పించాలి అంటూ ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. వైఎస్ షర్మిలా రెడ్డి రాసిన లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది. భద్రతపై షర్మిలకు ఆందోళన ఉండడం వల్లే ఈ లేఖను రాశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది వరకు షర్మిలకు ఉన్న భద్రతను తగ్గించారని, దాన్ని పునరుద్ధరించాలంటూ ఆమె లేఖలో కోరారరి పలువురు చెబుతున్నారు.
కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆందోళన
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత షర్మిల జోరు పెంచారు. ప్రతిపక్షాలు కంటే అధికారంలో ఉన్న తన అన్నపైనే తీవ్ర స్థాయిలో ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కూడా అంతే స్థాయిలో షర్మిలపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి కొంత మంది వైసీపీ నాయకులు ముందుకు వచ్చి షర్మిలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, వైసీపీ మధ్య రోజురోజుకూ అగ్గి రాజుకుంటోంది. వ్యక్తిగత విమర్శలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని అంతా భావిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో షర్మిలారెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. జగన్‌పై విమర్శలు చేసిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు నుంచి ఇబ్బందులుంటాయనో, ఇతర గొడవలకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్ధేశంతోనో షర్మిల భధ్రత పెంపుపై డీజీపీకి లేఖ రాసినట్టు చెబుతున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సమావేశాలు సజావుగా సాగే అవకాశముందని పేర్కొంటున్నారు.
డీజీపీ సానుకూలంగా స్పందిస్తారా..?
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాసిన లేఖపై డీజీపీ ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం షర్మిలకు వన్ ప్లస్ వన్ భద్రత ఉంది. దీన్ని ఫోర్ ప్లస్ ఫోర్‌కు పెంచాలని షర్మిల కోరుతోంది. పీసీసీ ప్రెసిడెంట్ కోరినట్టు ఆ మేరకు భద్రతను కల్పించేందుకు డీజీపీ అంగీకరిస్తారా..? ఇప్పుడున్న భద్రతను రెట్టింపు చేస్తారా..? ప్రస్తుతమున్న భద్రతను కొనసాగిస్తారా..? అన్నది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం తగిన భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా, ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, వైసీపీ మధ్య హోరాహోరీగా విమర్శలు, ప్రత విమర్శలు సాగుతున్నాయి. షర్మిల చేసే విమర్శలకు ప్రతిగా వైసీపీ కీలక నాయకులు తమదైన శైలిలో స్పందిస్తుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రానున్న రోజుల్లో అన్నా, చెల్లెళ్ల మధ్య పోరు మరింత ఆసక్తకరంగా ఉండే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.