Botsa Satyanarayana: రుషికొండ మీద నా ఇల్లో, సీఎం జగన్ అక్రమ కట్టడాలో లేవు: మంత్రి బొత్స ఘాటు వ్యాఖ్యలు
విశాఖలోని రుషికొండ మీద బొత్స సత్యనారాయణ ఇల్లో.. డిప్యూటీ స్పీకర్ అక్రమ కట్టడాలో, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ కట్టడాలో లేవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు
విశాఖలోని రుషికొండ మీద తన ఇల్లు.. డిప్యూటీ స్పీకర్ అక్రమ కట్టడాలో, లేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ కట్టడాలో లేవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసమని ప్రభుత్వ కట్టడాలు కడితే తప్పేమిటని ప్రశ్నించారు. విజయనగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో ఆవేశం, ఆవేదనతో మాట్లాడారని అన్నారు. ఎంతసేపూ ముఖ్యమంత్రిని ఆడిపోసుకోవడం, నిందలు వేయడమే చంద్రబాబు పనిగా ఉందని విమర్శించారు.
చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల కోసం ఏ కార్యక్రమాన్ని అయినా చేశారా..? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ‘మా పని అయిపోయిందంటున్నారు. మా పని అయిపోయిందో, మీ పని అయిపోయిందో ఏడాదిలో తెలిసిపోతుంది. ఇప్పటికే మీ పని అయిపోయింది.. ఎక్కడో కొద్దోగొప్పో మిగిలి ఉన్నా అది త్వరలోనే అయిపోతుంద’ని చెప్పారు. బాధ్యత గల రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి చులకనగా మాట్లాడకూడదని, మైకు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ప్రజల హర్షించారని తెలిపారు. ‘రుషికొండను బోడికొండ అంటున్నారు. రుషికొండలో ఏం జరుగుతోంది.. ప్రభుత్వ కట్టడాలు జరుగుతున్నాయని ఒకటికి పదిసార్లు చెప్పాం. అభివృద్ధి చేయడం తప్పా? ఏ ప్రైవేట్ కట్టడాలో, బొత్స సత్యనారాయణ ఇల్లో, డిప్యూటీ స్పీకర్, జగన్ మోహన్‌రెడ్డి ఆకమ్రణలు చేయడం లేదు కదా? అన్నారు.
ప్రభుత్వ పనులు చేస్తే తప్పేముంది. విశాఖలో ప్రజల ప్రయోజనం కోసం పని జరగకూడదా?’ అని ప్రశ్నించారు. ఇక్కడ ఐటీ పరిశ్రమ రాజశేఖరరెడ్డి హయాంలో తీసుకొచ్చామని, ఎవరి హయాంలో భూములు కేటాయింపులు అయ్యాయో ఒకసారి తెలుసుకోవాలన్నారు. అది నాలుకా, తాటిమట్టా? అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ‘ఫార్మాసిటీ ఎవరి హయాంలో వచ్చింది? నువ్వు తీసుకొచ్చావా? శిలాఫలకం ఉంటుంది చూడండి. పోనీ.. మీరొచ్చిన ఐదేళ్లలో అక్కడ బుగ్గి అయినా వేశారా? అందరికీ వాస్తవం తెలుసు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగిందంటే.. దివంగత రాజశేఖరరెడ్డి హయాంలోనే.. దానిని పూర్తి చేస్తున్నది జగన్ మాత్రమే.’ అని అన్నారు.
పేదవాడి ఆకలితో రాజకీయాలా?
టీడీపీ హయాంలో పేదవాడి ఆకలితో రాజకీయాలు చేశారని బొత్స అన్నారు. ‘జన్మభూమి కమిటీలతో దళారులను ప్రోత్సహించావు. ఆకలితో రాజకీయాలు చేయడం ఏమిటీ? ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే, రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేస్తున్నాం.’ అని మంత్రి బొత్స అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని మరింత పటిష్టంగా జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. పేద వాడి ఇంటికే వైద్యం వెళ్తుందని చెప్పారు. మనం ఎలా ఉన్నా మన పిల్లలు అభివృద్ధి చెందాలని పెద్దలు అనుకుంటున్నారు.. దాన్ని తాము నెరవేరుస్తున్నాం అన్నారు. ‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినది చంద్రబాబే. అభివృద్ధి కోసం అప్పులు చేయడం ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతుంది. సొంత పనుల కోసం ఎవరూ అప్పులు చేయర’ని తెలిపారు.
విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు దౌర్భాగ్యం
తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి బొత్స మాట్లాడుతూ.. రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దౌర్భాగ్యమన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి వ్యవహారాలను దేవుడు కూడా క్షమించడని చెప్పారు. ఏపీలో పరీక్షల కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు.