(Source: ECI/ABP News/ABP Majha)
భీమిలిలో ఈసారి గెలుపెవరిదో? ఆసక్తికరంగా రాజకీయం
Who won this time in Bhimili? Politics is interesting : విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం భీమిలి. ఇక్కడ 16 ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు తెలుగుదేశం, ఆరుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
Bheemili Politics: ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం భీమిలి. ఇప్పటి వరకు ఇక్కడ 16 ఎన్నికలు జరిగాయి. రానున్న 17వ ఎన్నికకు ఈ నియోజకవర్గం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఆరుసార్లు తెలుగుదేశం, ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 2,21,575 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,08,412 మంది ఉండగా, మహిళ ఓటర్లు 1,13,159 మంది ఉన్నారు. ఇక్కడ అత్యధికసార్లు ఆర్‌పీఎస్డీపీఎన్ రాజు వవిజయం సాధించారు. నాలుగుసార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. పీవీజీ రాజు మూడుసార్లు విజయాన్ని దక్కించుకున్నారు.
ఇవీ ఎన్నికల ఫలితాలు
1952లో తొలిసారి ఈ నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కె సూర్యనారాయణ తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన జీవీకేవీ రావుపై 987 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1955లో జరిగిన ఎన్నికల్లో పీఎస్పీపీ నుంచి పోటీ చేసిన జీకే రాజు తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన జీకేవీ రావుపై 7487 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1960లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీజీ రాజు ఇక్కడ విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆర్ మజుందార్‌పై 17,910 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పీవీజీ రాజు మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన జి రామానాయుడుపై 9332 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పీవీజీ రాజు మూడోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎంఏ రావుపై 17,316 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సూర్యనారాయణ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఏఎన్ కోటపై 6002 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డి జగన్నాథరాజు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్(రెబల్) కేఎస్‌ఎస్‌ఆర్ దేవిపై 21,355 ఓట్ల తేడాతో విజయం పొందారు. 1983లో టీడీపీ నుంచి పోటీ చేసిన పి ఆనంద గజపతిరాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీజే రాజుపై 39,666 ఓట్ల తేడాతో గెలుపొందారు. 19985లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్డీపీఏఎన్ రాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వి శేషగిరిరావుపై 34,145 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1989లో టీడీపీ నుంచి మరోసారి ఆర్‌ఎస్డీపీఏఎన్ రాజు విజయం దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కేవీవీ సూర్యనారాయణపై 32,214 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో నాలుగోసారి ఆర్‌ఏపీస్డిపీఏఎన్ రాజు విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె శంకరరావుపై 24,828 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కర్రి సీతారామ్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌డీపీఎఎన్ రాజుపై 241 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009 ఎన్నికల్లో పీఆర్‌పీ నుంచి పోటీ చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఆంజనేయరాజుపై 6310 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించారు. వైసీపీ నుంచి బరిలోకి దిగిన కర్రి సీతారామ్‌పై 37,226 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇక్కడ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన సబ్బం హరిపై 9712 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
వచ్చే ఎన్నికల పోటీపై ఆసక్తి
వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఎవరు బరిలోకి దిగుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. సిటింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గడిచిన ఎన్నికల్లో గెలిచిన తరువాత మంత్రిగా క్యాబినెట్‌లో పని చేశారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఇక్కడి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ నుంచి ప్రస్తుతం ఇన్‌చార్జ్‌గా రాజాబాబు ఉన్నారు. గంటా శ్రీనివాసరావు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.