YS Jagan Vizag Tour: ఏపీ సీఎం జగన్ విశాఖ పర్యటన వాయిదా, రెండ్రోజుల ముందే ఢిల్లీకి పయనం !
YS Jagan Vizag Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన షెడ్యూల్ ఖరారైనా తాత్కాలికంగా పర్యటన వాయిదా పడింది. ఈ నెలాఖరులోగా విశాఖలో పర్యటించనున్నారు.
YS Jagan Vizag Tour: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం షెడ్యూల్ ఖరారైనా పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. సీఎం జగన్ రేపు (శనివారం) విశాఖలో పర్యటించాల్సి ఉంది. కానీ ఈ 28న సీఎం జగన్ విశాఖ పర్యటన రద్దయింది. ఈ నెల 31న విశాఖలో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం జగన్ శనివారం ఢిల్లీ వెళ్లనున్నారని, అందువల్లే విశాఖ టూర్ వాయిదా పడినట్లు సమాచారం. ముందుగా ఈ నెల 30న జగన్ ఢిల్లీ వెళ్తారని ప్రచారం కాగా, రెండు రోజుల ముందుగానే వెళ్తున్న కారణంగా తాజా పర్యటనలు వాయిదా వేసుకున్నారు.
తొలుత నిర్ణయించిన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 28న ఉదయం 9.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి విశాఖకు బయలుదేరనున్నారు. ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి ఉదయం 11 గంటలకు చేరుకుని వార్షికోత్సవ కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్ హాల్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ అనకాపల్లి ఎంపీ బి. సత్యవతి కుమారుడు డాక్టర్ యశ్వంత్, డాక్టర్ లీలా స్రవంతి దంపతులను ఆశీర్వంచనున్నారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు రుషికొండ ఐటీ పార్క్ వద్ద గల విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ నివాసానికి సీఎఎం జగన్ వెళతారు. ఎంపీ కుమారుడు శరత్ చౌదరి, జ్ఞానిత దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.55 గంటలకు ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో సీఎం జగన్ ఆశీర్వదిస్తారు. అనంతరం విశాఖ పర్యటనను ముగించుకున్న ఏపీ సీఎం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
దుకాణాలు మూసివేత
చినముషిడివాడలోని శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ ఈ నెల 28న రానున్నారు. అయితే శారదా పీఠం రహదారి మార్గంలో ఉన్న పలు దుకాణాలను ఇదివరకే అధికారులు మూసివేశారు. సీఎం పర్యటన ఏమో కాని తమ జీవనాధారం అయిన దుకాణాలను మూసివేసి కడుపు కొడుతున్నారని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ పర్యటన కారణంగా ఏ క్షణంలో అధికారులు తీవ్ర నిర్ణయం తీసుకుని తమ దుకాణాలను తొలగించే ప్రయత్నం చేస్తారేమోనని భయాందోళనతో చిరు వ్యాపారులు తమ షాపులను మాసేస్తున్నారు. రోడ్డుకు అనుకుని ఉన్న కొన్ని దుకాణాలను మూయాలని అధికారులు హెచ్చరించడం వల్లే, మిగతా చిరు వ్యాపారులు తమ షాపులను మూసేశారని ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం పర్యటన వల్ల దుకాణాలను మూసివేయాలన్న ఆదేశాలు లేవని సీఐ గొలగాని అప్పారావు తెలిపారు. కానీ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు వెల్లడించారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్, మరో మంత్రి బొత్స సత్యనారాయణ ఉగాదికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు వస్తుందని చెబుతున్నారు. శాఖల తరలింపు కూడా ఉంటుందని అంటున్నారు. విద్యాశాఖ కార్యాలయం అందరి కంటే ముందే విశాఖకు వస్తుందని.. విద్యా సంవత్సరం ప్రారంభానికి ఉద్యోగులంతా తమ పిల్లలను విశాఖ స్కూళ్లలో చేర్పించుకునేలా చూస్తారని అంటున్నారు. అయితే అదే సమయంలో.. రాజ్యాంగంలో రాజధాని అన్న ప్రస్తావనే లేదని.. సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అనే కోణంలో సీఎం జగన్ విశాఖ వెళ్లి పరిపాలిస్తారని అంటున్నారు. అప్పుడు ఇది అధికారిక తరలింపు కాదు. అది మరో వివాదం అవుతుంది. అన్ని రకాల న్యాయపరమైన చిక్కులు తొలగిపోయేలా చేసుకునే వెళ్లవచ్చు కదా అన్న వాదన వినిపిస్తుంది.