వైజాగ్‌లో ఆ ప్లేస్‌కు వెళ్తే యుద్ద విమానంలో ఉన్న ఫీలింగ్ - సరికొత్త టూరిజం స్పాట్ చూశారా!
విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఇప్పటికే కురుసురా సబ్ మెరైన్, TU -142 విమానం మ్యూజియం, నేవీ అమరవీరుల స్మారక స్థూపం స్పెషల్ అట్రాక్షన్. ఇప్పుడు ఆ జాబితాలో మరొకటి చేరింది.
స్మార్ట్ సిటీ వైజాగ్‌లో మరో టూరిస్ట్ ఎట్రాక్షన్ రెడీ అయింది. ఇండియన్ నేవీలో 32 ఏళ్ల పాటు సేవలందించిన సి హరియర్ యుద్ధ విమానాన్ని మ్యూజియంగా మార్చి RK బీచ్‌లో సందర్శకుల కోసం సిద్ధం చేశారు. దీని కోసం దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం.
సీ-హారియర్ విమానం ప్రత్యేకతలు ఇవే
బ్రిటిష్ ఏరో స్పేస్ నుంచి భారత ప్రభుత్వం కొన్న సీ -హారియర్ విమానం మన నౌకాదళంలోని INS హంసలో ఏవియేషన్ విభాగంలో పని చేసింది. 2016లో దీనిని సర్వీస్ నుంచి తప్పించారు. దీన్ని ఏపీ ప్రభుత్వం VMRDA ద్వారా ఈ విమానాన్ని వైజాగ్‌కు రప్పించి టూరిస్టుల కోసం మ్యూజియంగా మార్చింది.
విశాఖలోని కురుసుర సబ్ మెరైన్ మ్యూజియంకు ఎదురుగా ఈ మ్యూజియం సిద్ధమైంది. ఇంతకుముందు రాజీవ్ స్మృతి భవన్‌గా పిలిచే భవనంలోనే ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. దీనిలో విమానంతో పాటు ఒక సిమ్యులేటర్‌ను కూడా సిద్ధం చేశారు. దీనిని కూడా గోవాలోని INS హంస నేవల్ బేస్ నుంచి రప్పించారు.
ఇందులోకి వెళ్లిన సందర్శకులకు సరికొత్త అనుభూతి కలగనుంది. స్వయంగా యుద్ధ విమానంలో ప్రయాణిస్తున్న ఫీలింగ్‌ను కలిగేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ ఏర్పాటు పూర్తి అయి చాలాకాలం అయింది. వైజాగ్‌లో జరుగుతున్న వరుస సదస్సుల కారణంగా సీ -హారియర్ మ్యూజియం ప్రారంభోత్సవం లేటు అవుతూ వస్తుంది.
ప్రస్తుతం అవన్నీ పూర్తి అవడంతో ఈ నెలలోనే ఈ మ్యూజియంను ప్రారంభించనున్నారు. ఈ మ్యూజియం కచ్చితంగా వైజాగ్ వచ్చే టూరిస్టులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు అధికారులు.
ఇప్పుడు అది సబ్ మెరైన్ మ్యూజియం కాంప్లెక్
విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఇప్పటికే ఉన్న కురుసురా సబ్ మెరైన్, TU -142 విమానం మ్యూజియం, నేవీ అమరవీరుల స్మారక స్థూపంతో ప్రస్తుతం రెడీ అయిన సీ -హరియర్ విమాన మ్యూజియంను కలిపి సబ్‌మెరైన్ మ్యూజియం కాంప్లెక్స్‌గా డెవలప్ చేస్తుంది VMRDA.
ముందుగా వీటన్నింటికీ కలిపి అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చెయ్యాలని భావించినా స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు అధికారులు. నిజానికి ఈ మ్యూజియం పనులు గత మే నెలలోనే పూర్తి అవుతాయని అధికారులు చెప్పినా ఆ పనులు చాలా లేటయ్యాయి. ఏడాది ఆలస్యంగా రెడీ అయినా.. ఒకసారి మ్యూజియం ఓపెన్ అయితే పబ్లిక్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ ఖాయం అని లెక్కలు వేస్తున్నారు VMRDA సిబ్బంది.