బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత
Anakapalli News: మంత్రి రోజాపై అసభ్య వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. అరెస్టుకు డిమాండ్ చేశారు
Anakapalli News: ఏపీ పర్యాటక మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అనకాపల్లి పరవాడ మండలంలోని వెన్నెలపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. అటు టీడీపీ శ్రేణులు కూడా ఆయన ఇంటివద్దకు చేరుకుంటున్నాయి. దీంతో ఇరు వర్గాల మోహరింపుతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడుతోంది.
ఆదివారం రాత్రి పది దాటిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని రౌండప్ చేశారు. అటువైపుగా ఎవర్నీ రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల మూమెంట్ చూసిన టీడీపీ శ్రేణులు, బండారు అభిమానులు ఒక్కొక్కరిగా అక్కడకు రావడం మొదలు పెట్టారు. అయితే వారెవర్నీ బండారు ఇంటివైపు రాకుండా పోలీసులు అభ్యంతరం చెప్పారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. తమ లీడర్ ఇంటికి వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను టీడీపీ శ్రేణులు నిలదీయడం మొదలు పెట్టాయి.
మంత్రి రోజాపై అసభ్య వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాపై సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. బండారు మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఒక మంత్రిపై రాజకీయాల్లో ఉన్న మహిళా నేతపై ప్రెస్ మీట్ లు పెట్టి మరీ.. బండబూతులు మాట్లాడుతున్నారని.. వీటిని ఎంత మాత్రం సహించరాదని పేర్కొన్నారు. వెంటనే కేసు నమోదు చేసి.. తక్షణం అరెస్టు చేయాలని డీజీపికి విజ్ఞప్తి చేశారు.
మంత్రి రోజాపై బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలువురు మహిళా నేతలు, న్యాయవాదులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు వాసిరెడ్డి పద్మ. బండారు వంటి మహిళా వ్యతిరేకులకు తగిన గుణపాఠం చెప్పాలని.. అతని వ్యాఖ్యలపై అందరూ సీరియస్ గా స్పందించాలని కోరారు.
బండారు ఏమన్నారంటే ?
నందమూరి, నారా కుటుంబాలపై వైసీపీ మంత్రి రోజా చేసిన అమర్యాద వ్యాఖ్యలను ఖండిస్తూ నాలుగు రోజుల కిందట మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోజాపై ఘాటు విమర్శలు చేశారు. ‘ఎన్టీఆర్ కుటుంబంపై, భువనేశ్వరి, బ్రాహ్మణీలపై మాట్లాడే అర్హత నీకు లేదు. రోజా... నువ్వు సినిమాల్లో ఎలా నటించావో నాకు తెలుసు. నీ చరిత్ర ఎవరికి తెలియదు. నీ బాగోతం బయటపెడితే నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక సంప్రదాయమైన కుటుంబం గురించి నువ్వు మాట్లాడటమెంటి..? ఒక పనికిమాలిన, దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్ రోజాకు సపోర్ట్ చేస్తున్నావు . మహిళలకు గౌరవమిచ్చే పార్టీ మాది. అందుకే నీ చరిత్ర బయట పెట్టడం లేదు. రోజా 24 గంటల్లోగా నందమూరి, నారా కుటుంబాలకు క్షమాపణ చెప్పకపోతే నీ చరిత్రను బయట పెడుతా’’ అని బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు.
నీతి సూత్రాలు, పతివ్రత కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు బండారు. తమ వద్ద నీ పూర్తి బండారం ఉందన్నారు. రోజా గతంలో బ్లూ ఫిల్ములలో నటించిందని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఆనాడు మిర్యాలగూడలో జరిగిన ఎన్నికల ప్రచారానికి వచ్చిన సంగతి మరిచి పోయావా అని ప్రశ్నించారు. ఎలక్షన్స్ కోసం వచ్చి ఎవరి ఇంట్లో ఉన్నావో తమకు తెలుసని, అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే. ఈ కామెంట్లు వైరల్‌గా మారడంతో.. మహిళా కమిషన్ స్పందించింది. ఇప్పుడు ఆయన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. 41ఏ కింద నోటీసులు ఇవ్వబోతున్నారని కూడా చెబుతున్నారు.