Atchannaidu : పసుపు బిళ్ల పెట్టుకొని వెళ్లండి- పని చేయని అధికారులు ఏమవుతారో చెప్పనవసరం లేదు?: అచ్చెన్నాయుడు
Srikakulam News: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పని ఉంటే పసుపు బిళ్ల పెట్టుకొని వెళ్లాలని సూచించారు. టీ ఇచ్చి పని చేసేలా అధికారులకు లైన్‌లో పెడతానన్నారు.
Andhra Pradesh News: కేంద్ర విమానాయన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా వెళ్లారు. ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానుల ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారుల పని తీరుపై కూడా విమర్శలు చేశారు.
ఆయన ఏమన్నారంటే" ఐదు సంవత్సరాలు అవమానాలు పడ్డారు. నేను మాట ఇస్తున్నాను. రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెబుతాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్సై దగ్గరకు వెళ్లినా, ఎమ్మార్వో దగ్గరకు వెళ్లినా ఎండీవో దగ్గరకు వెళ్లినా ఏ ఆఫీస్‌కు వెళ్లినా మీరు పసుపు బిళ్ల పెట్టుకొని వెళ్లండి మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్‌లో పెడతాను. ఎవరైనా ఒకరో ఇద్దరో నా మాటకు జవదాటితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసిన అవసరం లేదు"
ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని... 2019-24లో పరిపాలన ఎలా జరిగిందో చూశామన్నారు. రాష్ట్రంలో తన పార్టీ తప్ప ఇంకొకరు ఉండకూజదన్నట్లు జగన్ వ్యవహరించారన్నారు. ఎప్పుడూ ఇన్ని బాధలు పడలేదన్నారు అచ్చెన్న. పార్టీ ఉంటుందా లేదా అని నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పుకొచ్చారు. కష్టపడి పనిచేశాన్నారు.
నేను రాష్ట్ర మంత్రిగా, @RamMNK
— Kinjarapu Atchannaidu (@katchannaidu) June 17, 2024
కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా జిల్లాలో అడుగుతున్న సందర్భంగా వైజాగ్ నుండి నిమ్మాడ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది.. ఈ ర్యాలీకి బ్రహ్మరథం పట్టిన ప్రజలు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి… pic.twitter.com/y0ZtroIAKw
స్వాతంత్ర్యం వచ్చాక చాలా ఎన్నికలు జరిగాయని కానీ కూటమి 95 శాతం సీట్లు గెలిచి చరిత్ర సృష్టించామని అభిప్రాయపడ్డారు. వ్యవస్థలన్ని నాశనమయ్యాయని గుర్తు చేశారు. ఎలా పరిపాలన చేయాలో ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఎవరూ టెన్షన్ పడొద్దన్నారు. ఐదు నెలల్లో రాష్ట్రాన్ని గాడిన పెడతామని హామీ ఇచ్చారు.
తమది డబుల్ ఇంజన్ సర్కార్ అని... మోడీ సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తామన్నారు. జీవితాంతం శ్రీకాకుళం వాసులకు సేవ చేసిన రుణం తీర్చుకోలేనన్నారు అచ్చెన్నాయుడు. వ్యవసాయ ఆధారిత, సుదీర్ఘ తీర ప్రాంత జిల్లా మనకి వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ మార్కెటింగ్, పాడి శాఖ మన దగ్గరే ఉందని గుర్తు చేశారు. నలుగురు నిర్వర్తించే శాఖలు తనకు చంద్రబాబు అప్పగించారని వాటిని ఉన్నత స్థానంలో ఉంచుతానన్నారు.
తన జీవితం శ్రీకాకుళం జిల్లాకు, చంద్రబాబు కుటుంబానికి అంకితమన్నారు అచ్చెన్నాయుడు. ప్రతీ కార్యకర్తకు మాట ఇస్తున్నా.. ఎమ్మేల్యే అంటే ఇలా ఉండాలని సేవ చేస్తానన్నారు. తనతో కష్టపడి పనిచేసిన వారికే ముఖ్య శాఖలు వచ్చాయన్నారు. జిల్లాలో ప్రాజెక్ట్‌లు పూర్తిచేసి ప్రతీ ఎకరాకి నీరు అందిస్తామన్నారు. శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డును యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. మనల్ని ఇబ్బంది పెట్టిన ఏ అధికారులను వదిలి పెట్టబోమన్నారు. చట్టం తన పని చేసుకుని వెళ్తుందన్నారు అచ్చెన్నాయుడు.