(Source: Poll of Polls)
MILAN in Vizag: విశాఖలో భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం - మిలాన్ వేడుకలకు హాజరు
Visakhapatnam: మిలాన్ - 2024 వేడుకల్లో భాగస్వామ్యమయ్యేందుకు విశాఖ నగరానికి భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు గురువారం చేరుకున్నారు.
Vice President in Visakhapatnam: మిలాన్ - 2024 వేడుకల్లో భాగస్వామ్యమయ్యేందుకు విశాఖ నగరానికి భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు గురువారం చేరుకున్నారు. వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు ఐఎన్ఎస్ డేగాలో ఘన స్వాగతం లభించింది. మిలాన్ - 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఆయన ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జ్ఞాపికను, పుష్ప గుచ్ఛాన్ని అందజేసి, దుస్సాలువతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, తూర్పు నావికాదళ అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, అరకు పార్లమెంట్ సభ్యులు గొడ్డేటి మాధవి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జున, అడిషనల్ డీజీ (గ్రేహాండ్స్) ఆర్కె మీనా, పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్, నేవీ కమోడోర్ దిలీప్ సింగ్ తదితరులు ఉప రాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
ఇంటర్నేషనల్ మెరీ టైమ్ సదస్సులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
ఐఎన్ఎస్ డేగా నుంచి చోళాకు ప్రత్యేక వాహనంలో బయలుదేరిన ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ సముద్రిక ఆడిటోరియంలో జరిగిన ఇంటర్నేషనల్ మేరీ టైమ్ సదస్సులో పాల్గొన్నారు. సుమారు రెండు గంటలపాటు ఈ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు.
అలరించనున్న విన్యాసాలు
గురువారం సాయంత్రం కూడా బీచ్ రోడ్ లో నేవీ విన్యాసాలు జరగనున్నాయి. మిలాన్-2024 లో భాగంగా భారత్ నేవీతోపాటు వివిధ దేశాలకు చెందిన నేవీ అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విన్యాసాలు జరగనున్నాయి. వీటిని వీక్షించేందుకు భారీ ఎత్తున సందర్శకులు హాజరు కానున్నారు. గడచిన మూడు రోజుల నుంచి రిహార్సల్స్ బీచ్ రోడ్ లో జరుగుతున్నాయి.