Crocodile: సీలేరు మెయిన్ రోడ్డు పై 12 అడుగుల మొసలి హల్ చల్
12 అడుగుల భారీ మొసలి సీలేరు డ్యామ్ వద్ద గల మెయిన్ రోడ్డు పై హల్ చల్ చేసింది.

ఆంధ్ర, ఒడిశా బోర్డర్ సమీపంలోని సీలేరు డ్యామ్ వద్ద గల మెయిన్ రోడ్డు పై 12 అడుగుల భారీ మొసలి హల్ చల్ చేసింది. చీకట్లో దర్జాగా రోడ్డు పై తిష్ట వేసిన మొసలిని చూసి అటుగా వెళ్లే ప్రయాణికులు ఉలిక్కి పడ్డారు. ఒడిశా నుంచి బొలెరో వాహనం లో వస్తున్న వస్తున్న కొంతమంది సీలేరు వద్ద ఉన్న ఈ ముసలిని చూసి డ్యాం భద్రత సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న జన్ కో ఏఈ ఈ CH. సురేష్ కు ఈ విషయం తెలియడంతో ఆయన మొసలికి హాని చేయొద్దని తన సిబ్బందికి చెప్పి వారి సహకారంతో ఆ భారీ జలచరం తనంతట తానుగా నదిలోకి వెళ్లిపోయేలాగా ఏర్పాట్లు చేశారు.
గత ఏడాది కూడా ఇదే టైంలో ఇలానే ఒక మొసలి రోడ్డు పైకి వచ్చేసింది. ఇప్పటికే సీలేరు నదిలోను జలాశయంలోను అరుదైన ప్రాణులు నివసిస్తున్నట్టు నిరూపితమైంది. ఎక్కడో హిమాలయాల్లో ఉండే అరుదైన మాషీర్ చేప సీలేరు నదిలో ఉన్నట్టు 2024లోనే కనుగొన్నారు. ఇప్పుడు ఈ భారీ మొసళ్ల సంచారం కూడా సీలేరు ప్రాంతాల్లో ఉన్నట్టు తెలియడంతో అటుగా వచ్చే ప్రయాణికులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సిబ్బందికి అధికారులకు తెలియకుండా తొందరపాటు సాహసాలకు పాల్పడవద్దని జెన్ కో అధికారి సురేష్ తెలిపారు. అలాగే ఏవైనా వన్యప్రాణులు కనబడితే వాటికి హాని చేయకుండా వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు.
ఆంధ్రా లో పుట్టి ఒడిశా గుండా ప్రవహించే సీలేరు
ఉత్తరాంధ్ర అడవుల్లో పుట్టి ఒడిస్సా గుండె ప్రవహించే సీలేరు నది చివరకు శబరి నదిలో విలీనం అవుతుంది. ఎగువ ప్రాంతాల్లో మచ్ కండ్ గా పిలిచే ఈ నది దట్టమైన అడవుల గుండా ప్రవహిస్తుంది. అందుకే దీని తీరం వెంబడి అనేక వన్యప్రాణులు, గిరిజన గ్రామాలు కనిపిస్తూ ఉంటాయి. సీలేరు చుట్టుపక్క గిరిజన పల్లెల్లో జరిగే సంతలు చాలా ఫేమస్. అనేక అటవీ ఉత్పత్తులు, విభిన్న గిరిజన సంప్రదాయాలను ఇక్కడ చూసే అవకాశం ఉంటుంది. చాలా తరచుగా వన్యప్రాణులు కనిపిస్తూ ఉన్నా ఎవరూ వాటికి హాని చేయరు. అలాగే ఇక్కడి అటవీ చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. ప్రస్తుతం వేసవికాలం కావడంతో సీలేరు జలాశయం చుట్టు పక్కల వన్యప్రాణుల కదలికలు ఎక్కువైనట్టు అధికారులు చెబుతున్నారు.





















