Tammineni Seetharam : చంద్రబాబు అధికారమనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారు : స్పీకర్ తమ్మినేని
Tammineni Seetharam : వచ్చే ఎన్నికల్లో మహిళలే చంద్రబాబును ఇంటికి పంపిస్తారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
Tammineni Seetharam : చంద్రబాబు పర్యటనలు అసమర్థుడి అంతిమయాత్ర లాంటివని స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. జనంతో జగన్ బంధం ఎప్పుడో ముడిపడిందని స్పష్టం చేశారు. సంక్షేమం-అభివృద్ధే సీఎం జగన్ పాలనా నేత్రాలు అన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలే చంద్రబాబును ఇంటికి పంపిస్తారన్నారు. తోకలు కత్తిరిస్తానన్నందుకు బాబు పిలకనే బీసీలు కట్ చేశారని ఆరోపించారు.
అసమర్థుడి అంతిమయాత్ర
" 'జనం-జగన్' బంధం ఎప్పుడో ముడిపడిపోయింది. అది 2024 ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తుంది. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ సారి మహిళలే చంద్రబాబును తిరస్కరించి ఇంటికి పంపడం ఖాయం. చంద్రబాబు రాజకీయ అంపశయ్యపై ఉన్నారు. జనం వెంటిలేటర్ తీసేస్తే ఇక ఆయన పని అయిపోయినట్లే. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం. బాబు చేసే యాత్రలు అసమర్థుడి అంతిమయాత్ర లాంటివి. మూడు రోజులుగా కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు పర్యటనలో మాట్లాడే మాటలు వింటుంటే రాబోయే ఎన్నికల్లో గెలుపుపై ఆయనకు నమ్మకం కోల్పోయినట్లు కనిపిస్తోంది. అధికారమనే మానసిక వ్యాధితో బాబు బాధపడుతున్నారు. "నా కుర్చీ...నా కుర్చీ"అంటూ కలవరిస్తూ అలాగే కుప్పకూలిపోతారు."- స్పీకర్ తమ్మినేని
బాబు పిలకనే కత్తిరించారు
చంద్రబాబుకు దమ్ముంటే గత ఎన్నికల్లో 612 వాగ్దానాలతో విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను బయటకు తీసి మాట్లాడాలని స్పీకర్ తమ్మినేని సవాల్ చేశారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని అడుగుతుంటే వెబ్‌సైట్ నుంచే మేనిఫెస్టోను తీసేశారని విమర్శించారు. ఎన్టీఆర్ ఆత్మ బాబును వదలదన్నారు. ఎన్నికల సమయంలోనే బాబుకు ఎన్టీఆర్ గురుకొస్తారు, ఆయన విగ్రహాలను, ఫ్లెక్సీలను ఆవిష్కరిస్తారని ఆరోపించారు. ప్రజల ముందు మాట్లాడేటప్పుడు దిగజారిపోయి మాట్లాడరాదని సూచించారు. ఎన్నికలు సమీపించే కొద్దీ బాబు ఇంకా దిగజారిపోతారని స్పీకర్ తమ్మినేని మండిపడ్డారు. నాయీబ్రాహ్మణులు బాబును కలిస్తే మీ తోకలు కత్తిరిస్తానని వారితో దురుసుగా మాట్లాడినందుకు బీసీలు, బాబు పిలకనే కత్తిరించి ఇంట్లో కూర్చోపెట్టారని స్పీకర్ అన్నారు. మత్స్యకారులతోనూ ఇలాగే వ్యవహరించి, తన నైజాన్ని ప్రదర్శించారన్నారు.
సంక్షేమం–అభివృద్ధే సీఎం జగన్ పాలనా నేత్రాలు
సంక్షేమం, అభివృద్ధి తన పాలనా నేత్రాలుగా సీఎం జగన్ భావిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆయనే తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సీతారాం పునరుద్ఘాటించారు. ఇటీవల ప్రధాని విశాఖ వచ్చిన సందర్భంగా ఆయన సమక్షంలోనే వేదికపై సీఎం జగన్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాలే తప్ప తనకు రాజకీయ ప్రయోజనాలు లేవని కుండబద్దలు కొట్టారని చెప్పారన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సూచించిన మేరకే విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించామన్నారు. అన్ని సానుకూలతలు ఈ నగరానికి ఉన్నాయని సీతారాం తెలిపారు. రాజధానులపై ముఖ్యమంత్రికి దూరదృష్టి ఉందని ఆ దిశగానే ఆయన ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు. కర్నూలు జిల్లా పర్యటనలో న్యాయవాదులు, విద్యార్థి సంఘాలకు చెప్పు చూపించాలని ఉందని బాబు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇదేం సంస్కారం అని సీతారాం ప్రశ్నించారు. ఆయన దత్తపుత్రుడైతే ఏకంగా చెప్పునే చూపించారని ఎద్దేవా చేశారు.