Minister Botsa Satyanaraya : రుషికొండపై కొత్త భవనాలు కడితే తప్పేంటి? విశాఖలో ఏ కొండపైనా ఏం కట్టలేదా?- మంత్రి బొత్స
Minister Botsa Satyanaraya : ప్రధాని మోదీ విశాఖ టూర్ సక్సెస్ అయిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బహిరంగ సభలో సీఎం జగన్ రాజోయే తరాలకు మెసేజ్ ఇచ్చారన్నారు.
Minister Botsa Satyanaraya : ప్రధాని మోదీ, సీఎం జగన్ బహిరంగ సభ సక్సెస్ అయ్యిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రధాని సభకు ఉత్తరాంధ్ర వాసులంతా తరలి వచ్చారన్నారు. అందుకు ప్రతి ఒక్కరికి పార్టీ తరపున, ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. విశాఖ నగరం, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రధాని రావడం సంతోషదాయకమన్నారు. సభలో సీఎం జగన్ ప్రభుత్వ విధానాన్ని, పెండింగ్ సమస్యలను స్పష్టంగా వివరించారన్నారు. వాటన్నింటినీ పరిష్కరించాలని ప్రధానిని కోరారమన్నారు. తమకు రాజకీయాలు, పార్టీలు ముఖ్యం కాదని, రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని స్పష్టం చేశారు. రాజకీయం అంటే రోజూ విమర్శించడం, దూషించడం కాదని, ఇవాళ సీఎం ప్రసంగం రాబోయే తరాలకు మెసేజ్ ఇచ్చినట్లుగా ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న సీఎం దేశానికే ఒక మెసేజ్ ఇచ్చారన్నారు.
పవన్‌ది అజ్ఞానం
రాష్ట్రంలో దురదృష్టం ఏమిటంటే.. అటు రాజకీయ నాయకులు కానీ, కొన్ని పత్రికలు కానీ సాక్షాత్తూ ప్రధాని వస్తున్నారంటే, ఆయనకు ఈ సమస్యలు వివరించాలని, వాటిని పరిష్కరించమని కోరాలి కానీ పరిస్థితి వేరే విధంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నిన్న ఇక్కడికి ఒక సెలబ్రిటీ వచ్చారని, తనను ప్రధాని కలవమన్నారని చెప్పారన్నారు. ఆయన ప్రధానిని కలిసి, బయటకు వచ్చి, తాను ప్రభుత్వంపై ఫిర్యాదు చేశానని వెల్లడించారన్నారు. అంతే కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవి అడిగానని కానీ, ప్రస్తావించానని చెప్పలేదని విమర్శించారు. అలా చెప్పి ఉంటే ఎంతో హుందాగా ఉండేదని, కానీ పవన్ ఒక అజ్ఞాని అని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
'దేశంలోనే వైసీపీ నుంచి అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. అదే విధంగా అత్యధిక మెజారిటీతో ఎన్నికైన ప్రభుత్వం మాది. అయినా సరే అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సీఎం చెబుతుంటారు. అందుకు తగ్గట్లే ఆయన వ్యవహరిస్తున్నారు. సీఎంకు రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధిని కూడా కాంక్షిస్తున్నారు. ఇవాళ్టి సభకు లక్షల మంది ఎందుకు తరలి వచ్చారు. అభిమానం ఉండబట్టే కదా. అందుకే ఇప్పటికైనా ఆ నాయకులు వాస్తవాలు గుర్తించాలి. '- మంత్రి బొత్స
రుషికొండపై నిర్మాణాల్లో తప్పేమిటి?
'రుషికొండపై ఎందుకు తప్పుడు కథనాలు రాస్తున్నారు. రుషికొండ మీద ప్రభుత్వం కొన్ని భవనాలు కడుతోంది. అందులో తప్పేముంది? విశాఖలో ఏ కొండపైనా, ఏమీ కట్టలేదా? రుషికొండ మీద గతంలోనే గెస్ట్ హౌస్ ఉంది. ఇప్పుడు కొత్త భవనాలు కడుతుంటే ఏమిటి తప్పు? మీ విమర్శలు, ఆరోపణల వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం? కనీసం ఈ ప్రాంతానికేమైనా మేలు జరుగుతోందా?' - మంత్రి బొత్స
పవన్ అక్కడికెళ్లి ఏం చేస్తావు?
'రేపు పవన్‌కళ్యాణ్ విజయనగరం వెళ్తారట, జగనన్న లేఅవుట్ కాలనీ చూస్తారట. అది ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద లేఅవుట్. సుమారు 400 ఎకరాల్లో, 12 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. వారిలో 10 వేల మందికి ఇళ్లు మంజూరు చేశాం. పనులు సాగుతున్నాయి. అది కాలనీ కాదు. ఒక ఊరు అని చెప్పాలి. ఆ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. 10 వేల ఇళ్లు అంటే దాదాపు 40 వేల జనాభా. అంటే ఒక పట్టణంగా ఉంటుంది. 2006లో నేను ఉమ్మడి రాష్ట్రంలో హౌజింగ్ మినిస్టర్‌గా పని చేశాను. అప్పుడు సీఎంగా ఉన్న వైయస్సార్ రాష్ట్రంలో గుడిసెలు ఉండకూడదని, 25 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. అవి ఊళ్లుగా అభివృద్ధి చెందాయి.' అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.