Minister Roja On Lokesh : లోకేశ్ కాదు పులకేశి, అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే- మంత్రి రోజా సెటైర్లు
Minister Roja On Lokesh : లోకేశ్ యువగళం పాదయాత్రపై మంత్రి రోజా విమర్శలు చేశారు. లోకేశ్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్నారు.
Minister Roja On Lokesh : టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పాదయాత్రపై మంత్రి ఆర్కే రోజా సెటైర్లు వేశారు. లోకేశ్ పెద్ద ఐరన్ లెగ్ అంటూ ఎద్దేవా చేశారు. లోకేశ్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని విమర్శించారు. విశాఖలోని వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. హీరో తారకరత్న అస్వస్థతకు గురైతే చంద్రబాబు, లోకేశ్ పట్టించుకోలేదని ఆరోపించారు. లోకేశ్ అడుగుపెడితే రాజమండ్రి పుష్కరాల్లో జనం చనిపోయారని, పాదయాత్ర పోస్టర్ రిలీజ్ చేస్తే మరికొందరు చనిపోయారని ఆరోపించారు. యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన రోజే తారకరత్న అస్వస్థతకు గురయ్యారన్నారు. అతను లోకేశ్ కాదని, పులకేశ్ అంటూ విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి తీసుకుని లోకేశ్ ప్రజలకు ఏంచేశారని మంత్రి రోజా ప్రశ్నించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని రోజా ఆకాంక్షించారు. చంద్రబాబు, లోకేశ్ కు మహిళల గురించే మాట్లాడే అర్హత లేదన్నారు. సీఎం జగన్ పాలనలో మహిళలకు భద్రత పెరిగిందన్నారు.
జగన్ ను విమర్శించే అర్హత లోకేశ్ కు లేదు
"చంద్రబాబు, లోకేశ్ కు అధికారం మాత్రమే ముఖ్యం. తారకరత్నకు గుండెపోటు వచ్చి పడిపోతే కనీసం పట్టించుకోకుండా లోకేశ్ పాదయాత్ర చేశాడు. సీఎం జగన్ ను విమర్శించే అర్హత ఏ కోణంలో కూడా లోకేశ్ కు లేదు. నిన్న లోకేశ్ పాండిత్యాన్ని చూశాం. జీవో నెంబర్ 1 ను జీయో అంటారు. పాలనను పానల అంటారు. ప్రశాంతతను ప్రశాంత అత్త అంటారు. ఇలాంటి వ్యక్తి జగన్ గురించి మాట్లాడుతున్నారు. అతను లోకేశ్ కాదు పులకేశి. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ నూటికి 98 శాతం హామీలు నెరవేర్చారు. లోకేశ్ దొంగదారిలో మంత్రి అయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్ ప్రజలకు ఏంచేశారు. లోకేశ్ అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ వాళ్ల నాన్న కట్టారంట, బందరులో పోర్టు చంద్రబాబు కట్టారంట. శ్రీ సిటీ వాళ్ల నాన్న కట్టారంట. చంద్రబాబు కట్టనవి కట్టారని చెప్పుకుంటున్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా అధికారంలోకి రాగానే సీఎం జగన్ సచివాలయ వ్యవస్థను పెట్టి 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఏ పార్టీ వాళ్లు అయినా అందరికీ సమన్యాయం చేశారు. మెరిట్ బెసిస్ లో ఉద్యోగాలు ఇచ్చారు. వైసీపీ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు." - మంత్రి రోజా
అది మామూలు లెగ్గు కాదు - మాజీ మంత్రి అనిల్
వామ్మో అది లెగ్గు కాదు, మామూలు పాదం కాదు, ఆ పాదాలకు ఓ దండాలురా సామీ అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, యువగళం పాదయాద్రపై ధ్వజమెత్తారు. ఆ యాత్ర గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అన్నారు. ఆ పాదం మహిమ వల్లే నందమూరి కుటుంబానికి చెందిన ఒకరికి ఆల్రడీ స్టంట్ వేశారన్నారు. తండ్రి పాదం పెడితే ప్రాణాలు పోయాయని, కొడుకు పాదం మహిమ వల్ల నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తే ప్రాణాపాయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్ర వల్ల ఉపయోగమేం లేదని, హాయిగా సరదాగా యాత్ర చేసుకుని టైమ్ పాస్ చేసుకుని వెళ్లిపోవాలని సూచించారు అనిల్. వచ్చేసారి కూడా వైసీపీయే అధికారంలోకి వస్తుందని, జగనే సీఎం అవుతారని చెప్పారు అనిల్.