Minister Gudivada Amarnath : కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో వైసీపీ లేదు, మంత్రి హరీశ్ రావుపై గుడివాడ అమర్ నాథ్ ఫైర్
Minister Gudivada Amarnath : మంత్రి హరీశ్ రావు ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రులు ఖండించారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ అయితే ఓ రేంజ్ ఫైర్ అయ్యారు.
Minister Gudivada Amarnath : ఏపీలో ఉద్యోగులు, టీచర్లు సమస్యలపై పోరాటం చేస్తే కేసులు పెట్టి లోపలేస్తున్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మంచి ఫిట్‌మెంట్ ఇచ్చి గౌరవంగా చూస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు వరుసగా ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే మంత్రి బొత్స ఘాటుగా స్పందించి పీఆర్సీ పక్కపక్కన పెట్టుకుని చూసుకోవాలన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హరీశ్ రావు వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ హరీశ్ రావుపై తీవ్రంగా మండిపడ్డారు.
8 ఏళ్లలో టీఆర్ఎస్ చేసిందేంలేదు
"హరీశ్ రావు.. కేసీఆర్ మనిషా, లేక రామోజీరావు మనిషా చెప్పాలి. కేసీఅర్ తో ఏదైనా గొడవ ఉంటే వాళ్లు వాళ్లూ చూసుకోవాలి. మా రాష్ట్రం సంగతి మీకు ఎందుకు. మా రాష్ట్రానికి నీతులు, సూచనలు టీఆర్ఎస్ చెప్పాల్సిన పనిలేదు. ఏపీ భవన్ లో ఉద్యోగులను బూటు కాలితో తన్నిన ఘటన మరిచిపోలేదు. ఉద్యోగులను ఎవరు, ఎలా చూస్తారో ఆ ఘటనే నిదర్శనం. 8 ఏళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ చేసిందేం లేదు. " - మంత్రి గుడివాడ అమర్ నాథ్
కేసీఆర్ ను తిడితే హరీశ్ రావు హ్యాపీగా ఫీల్ అవుతారేమో!
"హరీశ్ రావుకు కేసీఆర్ తో ఏమైన గొడవలు ఉంటే మాతో ఎందుకు తిట్టించడం. నేరుగా ఆయనే తిట్టొచ్చుగా. మమ్మల్ని హరీశ్ రావు ఏమైనా అంటే మేము కేసీఆర్ తిడితే ఆయన ఆనందపడదామని అనుకుంటున్నారు. వాళ్లకు వాళ్లకు ఏమైనా గొడవలు ఉంటే వాళ్లు చూసుకోవాలి. హరీశ్ రావు వచ్చి సీఎం జగన్ ను తిడితే మేం కేసీఆర్ ను తిడతాం. సీఎం కేసీఆర్ ను మేం తిడితే హరీశ్ రావు హ్యాపీగా ఫీల్ అవుతారేమో! అలానే ఉంది ఆయన తీరు. ఏపీలో పేదవాళ్లకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయో, ఏపీ ప్రభుత్వం ఎలా పాలిస్తుందో ఇక్కడకు వచ్చి చూస్తే తెలుస్తోంది. కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను చూసి నేర్చుకోవాల్సి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మేంలేము. ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ తెలంగాణ చేసిందేంటి? వాస్తవం చెప్పమనండి. మూడేళ్లలో ఏంచేసిన సంక్షేమం ఏంటో చెప్పమనండి. "- మంత్రి గుడివాడ అమర్ నాథ్
టీఆర్ఎస్ కు ఆ అర్హత లేదు
"కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను, హరీశ్ రావుని చూసి నేర్చుకోవాల్సి దుస్థితిలో వైసీపీ లేదు. కేసీఆర్, హరీశ్ రావుకు ఏమైన తగువులు ఉంటే వాళ్లు వాళ్లూ చూసుకోమనండి. మా రాష్ట్రంపై ఎందుకు పడతారు. మమ్మల్ని తిడితే మీకు అక్కడ మార్కులు పడతాయా? తెలంగాణలో ఏపీ కంటే ఆర్థిక పరిస్థితి బాగుంది. హైదరాబాద్ ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగుంది. అయితే వాళ్లు ఏం సంక్షేమం చేశారో చెప్పమనండి. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులతో ఎలా ప్రవర్తించారో అందరూ చూశాం. నోటికొచ్చినట్లు తిట్టి, బూటు కాళ్లతో తన్నడం చూడలేదా?. ఏపీ భవన్ లో హరీశ్ రావు ప్రభుత్వ ఉద్యోగిని బూటు కాళ్లతో తన్నాడు. మా రాష్ట్రానికి హరీశ్ రావు నీతులు చెప్పాల్సిన అవసరంలేదు. మాకు సూచనలు ఇచ్చే అర్హత ఆ ప్రాంత నాయకులకు, టీఆర్ఎస్ కు, ముఖ్యమంత్రికి లేదు. " - మంత్రి గుడివాడ అమర్ నాథ్