Visakhapatnam: బోటు ప్రమాదం శోకం మిగిల్చిన రోజే కవలలకు జననం... సరిగ్గా రెండేళ్ల తర్వాత...
దేవుడి వరమో... కాకతాళీయమో... సరిగ్గా రెండేళ్ల తర్వాత ఘోర ప్రమాదం జరిగిన రోజే... ఇద్దరు పిల్లల్ని పొగొట్టుకున్న ఓ జంటకు కవలలు పుట్టారు.
2019 సెప్టెంబరు 15 గోదావరిలో జరిగిన బోటు ప్రమాదం.. ఇంకా కళ్ల ముందే కనబడుతుంది. వశిష్ట బోటు కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన దంపతులకు మళ్లీ అదే రోజు కవలలు పుట్టారు. ప్రమాదం జరిగిన రోజే కవలలు పుట్టడంతో ఇది దేవుడిచ్చిన వరమే అంటున్నారు దంపతులు. రెండేళ్ల క్రితం బోటు ప్రమాదంలో ఏ రోజేతై ఇద్దరు ఆడపిల్లలను కోల్పోయారో... సరిగ్గా అదే రోజున ఆ దంపతులకు ఇద్దరు ట్విన్స్ పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అదే రోజున
2019 సెప్టెంబర్ లో ఏపీలోని భద్రాచలం దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది. వశిష్ట బోటు కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ బోటులో విశాఖ ఆరిలోవకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉన్నారు. తలారి అప్పలరాజు తన తల్లితో ఇద్దరు కూతుళ్లు గీతావైష్ణవి, ధాత్రి అనన్యలను భద్రాచలం రాముడి దర్శనానికి పంపారు. ఆ ప్రమాదంలో ఇద్దరు కుమార్తులు.. ఒకరికి మూడేళ్లు, మరొకరికి ఏడాదిన్నర, తల్లితో కలిపి మొత్తం 9 మంది కుటుంబసభ్యులు మృతి చెందారు. ఈ విషయం తెలిసిన అప్పలరాజు బోరున విలపించారు. అతని భార్య భాగ్యలక్ష్మికి అప్పటికే ట్యూబెక్టమీ ఆపరేషన్ జరిగింది. ఇంక పిల్లలు పుట్టరని ఆ దంపతులు కుంగిపోయారు. కృత్రిమ గర్భాధారణ ద్వారా పిల్లలు పుడతారని తెలుసుకున్న అప్పలరాజు విశాఖలో పద్మశ్రీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. సరిగ్గా ప్రమాదం జరిగిన తేదీ అంటే సెప్టెంబరు 15న ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరు బిడ్డలను కోల్పోయి శోకంలో ఉన్న తమకు ఆ దేవుడు మళ్లీ వరమిచ్చాడని అప్పలరాజు దంపతులు మురిసిపోతున్నారు.
కవలలు జననం
కచ్చులూరు ప్రమాదం బంధువులందర్నీ కోల్పోయాక తమకు దేవుడిపై నమ్మకం పోయిందని అప్పలరాజు భార్య తెలిపారు. పిల్లలు చనిపోయాక నరకం అనుభవించామన్నారు. ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన రోజునే మళ్లీ ఇద్దరు కవలలకు జన్మనివ్వడం నిజంగా ఆ దేవుడి మహిమేనని భావిస్తున్నామన్నారు. ఆ ఇద్దరు పిల్లలు మళ్లీ పుట్టారని అందుకే వాళ్లకు గీతావైష్ణవి, ధాత్రి అనన్య పేర్లు పెడతామంటున్నారు. పిల్లలు పెద్దయ్యాక మళ్లీ భద్రాచలం సీతారాముల దర్శనానికి వెళ్తామని తెలిపారు. భాగ్యలక్ష్మికి ఈ నెల 20వ తేదీ డెలివరీ డేట్ అని వైద్యులు తెలిపారు కానీ ఆమెకు 15వ తేదీనే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయని వైద్యులు తెలిపారు.
ఆ రోజు ఏంజరిగింది?
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు మృతిచెందారు. సెప్టెంబర్ 15వ తేదీన తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం నుంచి పాపికొండలు విహారయాత్రకు లాంచీలు వెళ్లాయి. రాయల్ వశిష్ట బోటులో కూడా 77 మంది ప్రయాణికులు విహారయాత్రకు బయలుదేరారు. పాటలు, డాన్సులతో సందడి సాగుతున్న విహారయాత్ర ఒక్కసారిగా విషాదాంతం అయ్యింది. మధ్యాహ్నం సుమారు 1.45 గంటల సమయంలో కచ్చులూరు వద్దకు రాగానే ప్రమాదం బోల్తాపడింది. ఏం జరిగిందో అర్థం అయ్యేలోపే చాలా మంది జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదం నుంచి 26 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటివరకు 39 మంది మృతదేహాలు బయటకు తీశారు. మరో 12 మంది ఆచూకీ మాత్రం ఈ రోజుకూ దొరకలేదు.