(Source: ECI/ABP News/ABP Majha)
Vizag Steel Plant Protest: విశాఖ ఉక్కు పోరు @ 200వ రోజు... 10 కి.మీ మానవహారంతో నిరసన.. పట్టువదలని కార్మికులు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసన చేపట్టారు. ఈ నిరసన 200వ రోజుకు చేరింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం 200వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు భారీ మానవహారం చేపట్టారు. విశాఖలోని అగనంపూడి నుంచి అక్కిరెడ్డి పాలెం వరకు మానవహారంలో నిలబడ్డారు. ఉక్కు కార్మికులు చేపట్టిన ర్యాలీలో ప్రతిపక్షపార్టీ నేతలు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన 10 కి.మీ మానవహారంలో ఉక్కు పరిశ్రమ కార్మికుల కుటుంబాలు, విశాఖ నగరవాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మానవహారం, ర్యాలీ కారణంగా ఈ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లాభాల్లో ఉన్న ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల బాటలో నెడుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి వస్తుందనే కారణంతోనే ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైందన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రుల హక్కు
ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక విశాఖ స్టీల్ కర్మాగారాన్ని చెబుతారు. 32 మంది ప్రాణ త్యాగాలు, అవిశ్రాంత ఉద్యమాలతో పోరాడి సాధించుకున్న పరిశ్రమ ఇది. దేశంలో తీర ప్రాంత ఉక్కు కర్మాగారంగా స్టీల్ ప్లాంట్ కు పేరు. ఉక్కు పరిశ్రమ అంటే కేవలం లాభ నష్టాల గణాంకాలు, రాజకీయ సమీకరణాలు కాదు. పారిశ్రామికీకరణపై అవగాహన లేని కాలంలో వేల మంది తమ సాగు భూములను స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేశారు. పునరావాసం, ఉద్యోగం హామీతో నామమాత్రపు పరిహారం తీసుకుని తమ భూములు అప్పగించారు రైతులు. నాటి నుంచి అనేక అడ్డంకుల్ని అధిగమిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు సంస్థలకు దీటుగా నిలుస్తోంది. కానీ కేంద్రం నష్టాల పేరుతో ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధమైంది.
మరో మాటలేదు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం పట్టువీడడంలేదు. పునరాలోచన ఏదీ లేదని స్పష్టం చేస్తుంది. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడమే కేంద్రం వద్ద ఉన్న ప్రత్యామ్నాయ మార్గమని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కోనేందుకు పలు ప్రైవేట్ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. టాటా, ఇతర సంస్థలు పోటీలో ఉన్నట్లు సమాచారం.