Visakha Land Issue : ఎస్పీనే బెదిరించిన ఎంపీ మనుషులు, విశాఖలో ఎంపీ వర్సెస్ ఎస్పీ భూవివాదం!
Visakha Land Issue : విశాఖ నగరంలో ఎంపీ వర్సెస్ ఇంటెలిజెన్స్ ఎస్పీ భూవివాదం కలకలం రేపుతోంది. తన స్థలంలో ఎంపీకి చెందిన నిర్మాణ సంస్థ రోడ్డు నిర్మించేందుకు ప్రయత్నిస్తుందని ఎస్పీ పోలీసులను ఆశ్రయించారు.
Visakha Land Issue : విశాఖ నగరంలో భూకబ్జాలు(Land Grabbing) పెరిగిపోయాయని ప్రతిపక్షాలు తరచూ ఆరోపణలు చేస్తున్నాయి. ఇది నిజమేనని మరో ఘటన నిరూపిస్తుంది. అధికారబలంతో ఓ ఎంపీ ఇంటెలిజెన్స్ ఎస్పీ(Intelligence SP) స్థలాన్నే కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా కల్వర్టు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఇప్పుడు స్థానిక పోలీసుల వద్దకు చేరింది. అయితే ప్రభుత్వ ఉద్యోగానినైన తన స్థలానికి దిక్కులేదని, సామాన్యుల పరిస్థితేంటని ఎస్పీ ఆవేదన చెందుతున్నారు.
ఎంపీ వర్సెస్ ఎస్పీ భూవివాదం
కష్టార్జితంతో కొనుకున్న స్థలాన్ని గద్దలా తన్నుకుపోతున్నారు కొందరు రాజకీయ నేతలు. ఇప్పటి వరకూ సామాన్యులను టార్గెట్ చేసిన నేతలు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపై కూడా పడ్డారు. తాజాగా విశాఖలో ఎంపీ వర్సెస్ ఎస్పీ(MP Vs SP) భూ వివాదం నెలకొంది. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బిల్డర్స్ సంస్థపై ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు విశాఖ పోలీస్ కమిషనర్(Visakha Police Commissioner) కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. తన స్థలంలో అక్రమంగా కల్వర్టు నిర్మించారని ఆరోపించారు. ఎంవీవీ సంస్థ(MVV Constructions) అక్రమంగా రోడ్డు వేశారని ఫిర్యాదులో తెలిపారు. ప్రైవేటు స్థలంలో రోడ్డు ఎలా వేస్తారని ఎస్పీ మధు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కలుపుకుని ఎంపీ వెంచర్ వేశారని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
విశాఖ నగరంలోని మధురవాడ(Madhurawada) బక్కన్నపాలెంలోని గాయత్రి నగర్ నుంచి సాయిప్రియ లే అవుట్‌కు వెళ్లే దారిలో రోడ్డును ఇనుప రేకులతో ప్రహరీ నిర్మించారు. ఈ రోడ్డుకు బదులుగా మురుగు కాలువపై జీవీఎంసీ అనుమతి లేకుండా కల్వర్టు నిర్మించారు. దాని పక్కనే ఉన్న స్థలంలో నిర్మాణ పనులు చేపట్టగా ఎంవీవీ వెంచర్స్(MVV Ventures)కు చెందిన వ్యక్తులు అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డారని ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ అధికారినైన తన స్థలానికే దిక్కు లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. గాయత్రినగర్ రోడ్డు నెంబర్ 9లో ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు తమ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి 168 గజాల స్థలం కొనుకున్నారు. ఈ స్థలంలో ఇటీవల ఇంటి నిర్మాణం కోసం జీవీఎంసీ అనుమతి తీసుకుని పనులు ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాన్ని ఖాళీగా వదిలేసి సొంత స్థలంలో పనులు ప్రారంభించానని మధు తెలిపారు. పునాదులు తవ్వేందుకు పనులు మొదలుపెట్టగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన కొందరు వ్యక్తులు వచ్చి కార్మికులను బెదిరించి పనులను అడ్డుకున్నారు.
ఎంవీవీ మనుషుల దౌర్జన్యం!
ఇక్కడితో ఆగని ఎంపీ నిర్మాణ సంస్థ ఎస్పీ మధు స్థలం నుంచి రోడ్డు వేసేందుకు ప్రయత్నించారు. అది తన సొంత స్థలమని ఎలాంటి పనులూ చేయొద్దని హెచ్చరించినా వినలేదన్నారు. గతంలో ఈ లే అవుట్‌లో ప్రజల అవసరాలకు కోసం వేసిన ఓ రోడ్డును కబ్జా చేసి రోడ్డుకు అడ్డంగా గోడ కట్టారని మధు ఆరోపించారు. జీవీఎంసీ నిర్మించిన మురుగు కాల్వను కూడా ఆక్రమించి, మురుగు కాలువపై అనధికారికంగా ఓ కల్వర్ట్ నిర్మించారని ఆయన నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ వెంచర్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందినది, అతని మనుషులమని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వీరి వల్ల తన ఇంటి నిర్మాణం ఆగిపోయిందని ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు ఆవేదన వ్యక్తం చేశారు.