తెలుగు చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి బోధించాలి: రచయితల సంఘం డిమాండ్
తెలుగు చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని రచయితల సంఘం డిమాండ్ చేస్తోంది. విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం కూడా చేశారు.
తెలుగు చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని రచయితల సంఘం డిమాండ్ చేస్తోంది. విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం కూడా చేశారు.
రచయితల మహాసభలు...
తెలుగు వారికున్న ఘనమైన చరిత్రను తప్పనిసరి సబ్జెక్టుగా చేసి, తెలుగులో బోధించినప్పుడే చరిత్ర ప్రజలకు చేరుతుందని మాజీ ఉప సభాపతి, ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవాధ్యక్షులు, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. 5వ ప్రపంచ రచయితల మహా సభల సందర్భంగా నందమూరి తారకరామారావు వేదికపై జరిగిన చరిత్ర రంగ ప్రతినిధుల సభకు మండలి బుద్ద ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మన చరిత్ర రచనకు గతంలో ఎంతో మంది మహనీయులు జీవితాలను త్యాగం చేశారని, వారి స్ఫూర్తితో ఈ తరం చరిత్రకారులు పూనుకుని తెలుగువారి చరిత్రను సుసంపన్నం చేయాలని బుద్ధప్రసాద్ అన్నారు.
చరిత్ర ప్రతినిధుల సభకు అధ్యక్షత వహించిన చరిత్ర పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి ఇటువంటి సభల్లో చరిత్ర రంగ సదస్సు నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. డా.సి.హెచ్.ఎస్ సుందర్ సభ్యులు కళాశాల స్థాయి వరకు చరిత్రను, సాంకేతిక వృత్తి విద్యతో పాటు అన్ని కోర్సులలోను తప్పనిసరి సబ్జెక్టుగా బోధించడానికి, ఇంకా రాష్ట్రం విడిపోయినపుడు హైదరాబాద్ లో ఉండిపోయిన ఈ ప్రాంతానికి చెందిన పురాతన వస్తువులను, రాత పత్రాలను ఇక్కడికి తరలించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్న తీర్మానాలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ సిలార్, డా.మొవ్వ శ్రీనివాసరెడ్డి, డా. గోవిందు, సురేంద్ర, తవరం వెంకటేశ్వరరావు, చెన్ను గాంధీలు చరిత్ర ప్రాముఖ్యత, రచనా బోధన పద్ధతులు, తెలుగు మాధ్యమాలలో భోదించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కి అస్థిత్వం లేదు... ఎ.బీ వెంకటేశ్వరరావు ఆందోళన
తెలుగును ముందుకు తీసుకెళ్లకపోతే ఆంధ్రప్రదేశ్ కి అస్థిత్వం లేదని, కావున ప్రజలందరూ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఐపీఎస్ ఆఫీసర్ ఎ. బి. వెంకటేశ్వరరావు అన్నారు. ఐదవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో పాల్గొని, "మారుతున్న సమాజిక పరిస్థితులలో రచయితల పాత్ర" అనే అంశంపై సంభాషించారు. అందరికీ తెలిసి కూడా తరచూ మర్చిపోయేదేమిటంటే ఆంధ్రప్రదేశ్ ఆస్థిత్వం, ఆంధ్రప్రదేశ్ చిరునామా కేవలం తెలుగు మాత్రమేనని, అంతకంటే ఏపీకి వేరే ఐడెంటిటీ మరొకటి లేదని అన్నారు. దేశం మొత్తానికి ఒక ప్రిన్సిపల్ గా, భౌగోళిక రాజకీయ సూత్రంగా నేర్పించి మనం మాత్రం తెలుగును మర్చిపోతున్నామన్నారు. ఈనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం, అందులోనూ తెలుగువారు పోషించినటువంటి ముఖ్యమైన పాత్రను ఈతరం వారు, ఇంతకు ముందు తరం వారు కూడా మర్చిపోయారు అనిపిస్తుందన్నారు. ఆ విషయం గుర్తుండి ఉంటే తెలుగు భాషను గత 30-40 సంవత్సరాలుగా విస్మరించి ఉండేవారు కాదన్నారు. ఏ భాషా ప్రాతిపదికన మనం మద్రాస్ రాష్ట్రం నుంచి ఎన్నో పోరాటాలు, త్యాగాలు నుండి పుట్టిన రాష్ట్రంలో వారసత్వంగా పొందామో, ఆ భాషను పెంపొందించడానికి ఇతర రాష్ట్రాలలో ఉన్న వారికి భాషను పరిచయం చేయడానికి కనీసం ప్రయత్నం చేయకపోవడం తెలుగు వారు చేసుకున్న దురదృష్టమని, ఖర్మ ఫలితం అనుభవిస్తున్నామన్నారు.
ఈ ఖర్మ ఫలితం తెలుగువారు ఒక భాషగా, ఒక జాతిగా, ఒక సంస్కృతిగా తమను తాము గుర్తించకపోవడం అని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, మధ్యాంద్ర అంటూ పలురకాలుగా తెలుగును విభజిస్తున్నామన్నారు. మనం ఎక్కడివారం అంటూ చూసుకునే దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చినదని అన్నారు. తెలుగు ప్రజలకు ఉన్న ఐడెంటిటీ రూపుమాసిపోయిందన్నారు. దేశంలో నేడు ఎన్నో భాషా సమూహాలు అంతరించి పోయాయని, తెలుగు అతీతం కాదన్నారు. ఇదంతా చూస్తుంటే తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ కి పట్టిన పిచ్చిలా ఉంది తప్ప, ప్రభుత్వానికి, మేధావులకు, విజ్ఞానులకు ఎవరికీ పట్టడం లేదని అన్నారు. అందరం కలిసి నడుంబిగిస్తే తప్ప భవిష్యత్తు తరాలవారికి సమాధానం చెప్పలేమన్నారు. గత 40 సంవత్సరాలుగా తెలుగులో సాహిత్య ప్రమాణాలు దిగజారిపోయాయని అన్నారు. పత్రికా సంస్థలు కూడా ఒక్కొక్కటి మూసేస్తున్నారని, కనీసం దినపత్రికలు కూడా ఎంతకాలం ఉంటాయో తెలియడం లేదన్నారు. చిన్న వయసులోనే పిల్లలకు జ్ఞానం వికసించాలన్నా,మేధస్సు వికసించాలన్నా పిల్లలకు మాతృభాషలోనే బోధన జరగాలని తెలిపారు. నేడు భాష రాజకీయాలలో పడి నలిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.