Vijayawada GGH Incident: విజయవాడ జీజీహెచ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం కేసు - సీఐ, ఎస్ఐ సస్పెండ్
Vijayawada Rape incident: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
Vijayawada GGH Incident: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సీఐ, సెక్టార్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేశారు. కుమార్తె కనిపించలేదన్న తల్లిదండ్రుల ఫిర్యాదును పట్టించుకోకపోవడంపై క్రమశిక్షణా చర్యలలో భాగంగా నున్న సీఐ హనీష్, సెక్టార్ ఎస్సై శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు వేశారు.
పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు, ఉన్నతాధికారుల చర్యలు
కుమార్తె కనిపించలేదన్న మానసిక వికలాంగురాలి తల్లిదండ్రుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. యువతిపై అత్యాచారం జరగడంతో పోలీసులు క్రమశిక్షణా చర్యలకు నిర్ణయం తీసుకున్నారు. నున్న సీఐ హనీష్, సెక్టార్ ఎస్సై శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నున్న పోలీసులు నిర్లక్ష్యం కారణంగా యువతిపై అఘాయిత్యం జరిగిందని, పోలీసులు సకాలంలో కేసు నమోదు చేసి విచారణ చేపడితే ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకపోయేది అని బాధితురాలి కుటుంబసభ్యులు, బందువులు ఆరోపించారు. గురువారం నాడు సీపీఎం నేతలు సైతం బాధితురాలి కుటుంబానికి మద్దతుగా నిలిచి నున్న పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యాల కారణంగా అమాయక యువతులపై రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో గురువారం దారుణం వెలుగుచూసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మతిస్థిమితంలేని యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రేమ పేరుతో యువతిని మభ్యపెట్టి అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీజీహెచ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూడ్రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగిరాకపోయే సరికి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నున్న పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం యువతిని జీజీహెచ్ గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నున్న పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనపై దిశ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జీజీహెచ్ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: Baramulla Encounter: ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సహా నలుగురు ఉగ్రవాదులు హతం