Chandrababu: చంద్రబాబుకు చుక్కెదురు! ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌కు ఏసీబీ కోర్టు అనుమతి
సోమవారం (అక్టోబరు 12) చంద్రబాబును కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. ఆ రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు హాజరుపర్చాలని జడ్జి ఆదేశించారు.
ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి తెలిపింది. సోమవారం (అక్టోబరు 12) చంద్రబాబును కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. ఆ రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ప్రత్యక్షంగా హాజరుపర్చాలని జడ్జి ఆదేశించారు. శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పులు వస్తే జోక్యం చేసుకోవచ్చని చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు సూచించింది.
పీటీ వారెంట్ అంటే?
పీటీ వారెంట్ అంటే (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ - Prisoner in Transit). ఇప్పటికే జైలులో ఉన్న ఖైదీని మరో కేసులో విచారణ కోసం, జైలు నుంచి ఇంకో ప్రాంతానికి తరలించేలా కోర్టు అనుమతి కోరతారు. అప్పుడు కోర్టు పీటీ వారెంట్ ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జైలులో ఉన్న ఖైదీని మరో చోటికి తరలించడం. సీఆర్పీసీలోని సెక్షన్ 269 కింద కోర్టు పీటీ వారెంట్‌ని ఇస్తుంది.
ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి చంద్రబాబు గత నెల రోజులకు పైగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ కేసులో చంద్రబాబుకు ఈనెల 19వరకు జ్యూడీషియల్ రిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఫైబర్ నెట్ కేసులో సోమవారం ఆయన్ను ప్రత్యక్షంగా హాజరుపర్చాలని జడ్జి ఆదేశించారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం (అక్టోబరు 12) సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు వెల్లడించింది.
మరో వైపు చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన కాల్ డేటా పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు అంగీకరించింది. ఈ పిటిషన్‌పై వాదనలు రేపటికి (అక్టోబరు 12) వాయిదా వేయాలని సీఐడీ తరఫు న్యాయవాది కోరగా.. అందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో కాల్‌డేటా పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నాయి.