Rajnath Singh: ఏపీకి అమరావతే ఏకైక రాజధాని, నో డౌట్ - రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు
Rajnath Singh Comments: ఏపీకి రాజధాని ఏదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కొందరు నేతలు సమావేశంలో లేవనెత్తారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ క్లారిటీ ఇచ్చారు.
Rajnath Singh comments on Amaravati: ఏపీ రాజధాని అమరావతి అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో రాజ్‌నాథ్ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీకి రాజధాని ఏదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కొందరు నేతలు సమావేశంలో లేవనెత్తారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన సమాచారం ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ కూడా అమరావతినే ఏకైక రాజధానిగా పరిగణనలోకి తీసుకుందని, ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాజ్ నాథ్ దీమా వ్యక్తం చేశారు. తనకున్న 40 ఏళ్ల రాజకీయ అనుభంతో ఈ విషయం చెబుతున్నానని అన్నారు. ఆంధ్రాలో గతంలో కంటే తమకు ఓటు బ్యాంకు పెరిగిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇబ్బందులున్నా పోరాటాల ద్వారానే ప్రజల్లో నిలుస్తామని పేర్కొన్నారు.
అంతకుముందు రాజ్ నాథ్ సింగ్ విశాఖపట్నంలో క్లస్టర్ ప్రవాస్ యోజనలో భాగంగా జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్.. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం పథకాల వలన ఏపీలో బీజేపీకి ప్రజాదరణ బాగా పెరుగుతుందని చెప్పారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదని నిఖార్సైన సెక్యులర్ పార్టీ అని అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం గుర్తించిందని చెప్పారు. బీజేపీని చూసి ఓర్వలేని వారు.. బీజేపీని ఉత్తర భారత పార్టీ అని ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.