గన్నవరం విమాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్ కలకలం - జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?
గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఏపీ ఉన్నతాధికారి భార్య దొరికారంటూ ప్రచారం జరుగుతోంది.
Crime News : విదేశాల నుంచి వచ్చే విమానాల్లో ముఖ్యంగా దుబాయ్ నుంచి వచ్చే విమానాల ద్వారా బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా స్మగ్లర్లు తెర వెనుక ఉండి.. ఊరూపేరు లేని వాళ్లతో స్మగ్లింగ్ చేయిస్తూ ఉంటారు. అందుకే ఎయిర్‌పోర్టులో వారు దొరికినా అసలు ముఠాలు పట్టుబడవు. కానీ గన్నవరం విమానాశ్రయంలో 970 గ్రామాల బంగారాన్ని దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకు వస్తూ ఓ మహిళ దొరికిపోయింది. ఆమె ఏపీకి చెందిన ఓ ఉన్నతాధికారి భార్య అని ప్రచారం జరగడంతో కలకలం ప్రారంభమయింది. ఆ మహిళను గన్నవరం విమానాశ్రయంలో గురువారం అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
పక్కా సమాచారంతో హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ ఆపరేషన్
దుబాయ్ నుంచి భారీగా స్మగ్లింగ్ జరుగుతున్నట్లుగా స్పష్టమైన సమాచారం రావడంతో హైదరాబాద్ నుంచి స్పెషల్ టీమ్ వచ్చి గన్నవరం విమానాశ్రయంలో తనిఖీలు చేశారు. బంగారంతో మహిళ పట్టుబడిన తర్వాత కస్టమ్స్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన మహిళ ఇలా చాలా సార్లు దుబాయ్ నుంచి రాకపోకలు సాగించినట్లుగా రికార్డులు ఉండటంతో కస్టమ్స్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను కస్టమ్స్ కార్యాలయానికి తరలించినట్లుగా తెలుస్తోంది.
ఎయిర్ ఇండియా ఉద్యోగులు సహకరించినట్లుగా అనుమానాలు
ఆమె ఒక్కరే ఇలా పెద్ద మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేయడానికి అవకాశం ఉండదని సహకరించేవారు ఉంటారన్న ఉద్దేశంతో దర్యాప్తు జరుపుతున్నారు. ఎయిర్ ఇండియా సంస్థలో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది కింద స్థాయి, పై స్థాయి ఉద్యోగులు సహకరించినట్లు సమాచారం ఉండటంతో ..బంగారం తీసుకొని వచ్చిన మహిళతోపాటు ఎయిర్ ఇండియా సిబ్బందిని కూడా కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా మహిళ పట్టుబడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం.. ఆమె వీఐపీ అన్న ప్రచారంతో ఒక్క సారిగా కస్టమ్స్ అధికారుల దర్యాప్తుపై ఆసక్తి ప్రారంభమైంది.
గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిన ఆమె తమ అదుపులో ఉన్నారని ప్రకటించిన డీఆర్‌ఐ
ఈ అంశం మీడియాలోనూ హైలెట్ కావడంతో డీఆర్ఐ అధికారులు అధికారిక ప్రకటన చేశారు గన్నవరం ఎయిర్‌పోర్టులో 970 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసినట్లు ప్రకటించారు. తమ అదుపులో దుబాయ్ నుంచి వచ్చిన మహిళను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. ఆమె ఎవరన్నదానిపై ఇప్పుడు ఆసక్తి వ్యక్తమవుతోంది. ఎన్ని సార్లు దుబాయ్ వెళ్లారు.. ఎన్ని సార్లు ఇలా గన్నవరం ఎయిర్‌పోర్టుకు బంగారం తెచ్చారన్నదానిపై ప్రాథమికంగా డీఆర్ఐ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. గన్నవరంలోనే ఇలా స్మగ్లింగ్ చేయడానికి కారమం ఏమిటి..? అక్కడి సిబ్బంది సహకరిస్తున్నారా అన్న కోణంలోనూ విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
రాహుల్ జోడో యాత్రపై తెలుగు రాష్ట్రాల నేతల ఆశలు ! చిక్కిపోతున్న కాంగ్రెస్ రాత మారుతుందా ?