Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనకు ఏడాది పూర్తి; జగన్ నామస్మరణ మానుకుంటేనే మేలు!
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు కాలేదు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ...

Andhra Pradesh : మొన్న జూన్ 4న కూటమి ఏడాదిపాలనంటూ అటు ప్రభుత్వం, ఇటు విపక్ష వైసిపి హడావిడి చేశారు. కానీ కేవలం పార్టీలు గెలిచిన రోజు మాత్రమే. అధికారికంగా ప్రభుత్వ పాలన చేపట్టింది మాత్రం జూన్ 12న. ఇప్పుడు అధికారికం గా చెప్పుకోవచ్చు ఏడాది పాలన ముగిసింది అంటూ. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం తమ సాధించిన ఘనతలుగా చెప్పుకుంటున్న ముఖ్యమైన అంశాలు "ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని, అమరావతి పనుల్లో కదలిక వచ్చిందని, పోలవరం ప్రాజెక్టు కూడా ఒక దరికి చేరే సూచనలు కనిపిస్తున్నాయని, రాష్ట్రానికి ఇప్పటిముబ్బడిగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయని". ప్రభుత్వం చెబుతున్న స్థాయిలో కాకపోయినా ఈ ఏడాది కాలంలో ఒకమేర పనుల్లో కదలిక వచ్చిందనేది మాత్రం వాస్తవం. అలాగే సామాజిక పెన్షన్లను 4000 కి పెంచడం, DSc నిర్వహణ లాంటివి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత తెచ్చాయి. గతేడాది వచ్చిన విజయవాడ వరదల నిర్వహణ, కడప మహానాడు సక్సెస్ పార్టీలో జోష్ పెంచాయి.
అయితే ఈ ఏడాది కాలంలో సూపర్ సిక్స్ హామీల్లో మూడు సిలిండర్ల హామీ మాత్రమే కార్యరూపం దాల్చింది. మిగిలిన ఐదు హామీలను ఇంకా ప్రారంభించలేదు. ముఖ్యంగా తల్లికి వందనం, మహిళలకు ఫ్రీ బస్సు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని జనం ఎదురుచూస్తున్నారు. వీటిని త్వరలోనే అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం టిడిపి తన వైఖరి మార్చాల్సిందే. అదే "జగన్ నామ స్మరణ "
ప్రతీ దానికీ "జగన్ "అంటే ఇక కుదరదు
ఏదైనా ఒక ప్రభుత్వం వద్దనుకుని మరొక పార్టీకి జనం ఎందుకు ఓటేస్తారంటే ఒకటి ఆ ప్రభుత్వ పద్దతి అన్నా నచ్చకపోయి ఉండాలి లేదా మరొక పార్టీ ఇచ్చిన హామీలన్నా నచ్చి ఉండాలి. 2024 ఎన్నికల్లో ఆ రెండూ జరిగాయి. అందుకనే కూటమికి ఆ స్థాయిలో మెజార్టీలు వచ్చాయి. ఈ ఏడాది కాలంగా అధికార పార్టీ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అంటూనే మరోవైపు ప్రతిదానికి గత పాలన వైఫల్యం అంటూ ఆరోపిస్తూ వస్తున్నారు. కొంతవరకు దాంట్లో నిజం ఉన్నా ఇకపై అది మాత్రం జనాలు ఒప్పుకోరు. సంక్షేమం పరంగా జగన్ చేపట్టిన పథకాల ఎఫెక్ట్ ఇంకా జనాల్లో ఉంది. అయినప్పటికీ గత ఐదేళ్లు జగన్ వేసిన తప్పునే ఇప్పుడు కూటమి చేస్తోంది. అప్పట్లో ప్రతిదానికి చంద్రబాబును టిడిపిని విమర్శిస్తూ జగన్ ఆయన మంత్రులు గడిపేశారు. చివరికి అది చంద్రబాబుపై సానుభూతిని పెంచడానికి ఉపయోగపడింది తప్ప వైసిపికి ఏమాత్రం లాభించలేదు. ప్రస్తుతం కూటమి కూడా అదే ధోరణి లో కనపడుతోంది. అమరావతి సహా అధిక శాతం జనాల్లో అభివృద్ధిపరంగా జగన్ పాలనపై కొంత అసహనం ఇంకా ఉంది కాబట్టి ఈ ఏడాది కాలం సరిపోయింది గాని ఇకపై కూటమికి అది చెల్లదు.
చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్, కేంద్రంలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న పలుకుబడి ప్రజల్లో చాలా హోప్ ని పెంచేసాయి. ఇకపై వాళ్ళ చూపు అంతా పూర్తిగా డెవలప్మెంట్ మీద, ఎన్నికల హామీలపైనా ఉంటుంది. ఎంతో కొంత స్థాయిలో వాటినందుకోవాల్సిన బాధ్యత కూటమిదే. ఏమాత్రం తేడా వచ్చినా ఏం జరుగుతుందనేది జగన్ ఓటమి రూపంలో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. మంత్రుల దగ్గర్నుంచి గ్రామస్థాయి లీడర్ వరకు జగన్ పై విమర్శలు సంధిస్తూనే గడిపేయడం ఇకపై చెల్లదు. ఆ హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది. ఇకపై పూర్తిగా ప్రభుత్వం అభివృద్ధిపైన దృష్టి పెట్టాల్సిన తరుణం వచ్చేసింది. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి తన పాలన కొనసాగించాల్సిన స్టేజ్ లోకి ప్రభుత్వం ఎంటర్ అవుతోంది. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని కూటమి ఏమేరకు అందుకుంటుందో చూడాలి.





















