Kesineni Nani : చంద్రబాబు క్లీన్ పర్సన్ గా బయటకు వస్తారు, విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద కేశినేని నాని
AP Skill Development Scam Case: స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి ఆరోపణల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని అక్రమంగా అరెస్ట్ చేశారని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు.
AP Skill Development Scam Case:
స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి ఆరోపణల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని అక్రమంగా అరెస్ట్ చేశారని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ కేసులో అసలు పస లేదన్నారు. నికార్సైన నిజమైన నేత బాబు ఒక్కడేనని, ఏ విధంగా చూసినా మాజీ సీఎం చంద్రబాబుకి ఈ కేసుకి సంబంధం లేదన్నారు. చంద్రబాబు క్లీన్ పర్సన్ గా కేసు నుంచి బయటకు వస్తారని దీమా వ్యక్తం చేశారు.
విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసిన అనంతరం చంద్రబాబును ఎంపీ కేశినేని నాని, మరికొందరు టీడీపీ నేతలు కలిశారు. నారా లోకేష్ ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందన్నారు. భయం, ట్రాన్స్ ఫర్, పదోన్నతుల కోసం అధికారులు పాకులాడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు కేసుపై తీర్పు వెలువడనుండగా.. విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. సమీప ప్రాంతం నుంచి కోర్టుకు వెళ్లే దారుల్లో రాకపోకలు నిషేధించారు. లాయర్లకు మాత్రమే కోర్టు ప్రాంగణంలోకి అనుమతించారు. కేవలం 30 మంది కోర్టు హాలులో ఉండేందుకు అనుమతించారు. పలు జిల్లాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు.
చంద్రబాబు నాయుడు కేసులో జస్టిస్ హిమబిందు మరికాసేపట్లో తీర్పు వెలువరించనున్నారు. మరోవైపు విజయవాడ నుంచి టీడీపీ పార్టీ ఆఫీస్ వరకు పోలీసులు రూట్ క్లియర్ చేశారు. మరో అరగంటలో చంద్రబాబు కోర్టు నుంచి బయలుదేరే అవకాశం ఉందని తెలుస్తుంది. టీడీపీ ముఖ్య నాయకులతో, అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ కానున్నారని సమాచారం.
చంద్రబాబు కేసులో సెక్షన్ 409, 17ఏ కీలకంగా మారాయి. మిగతా సెక్షన్లలో అయితే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చంద్రబాబు అరెస్టులో ఈ రెండు సెక్షన్లు వర్తించవని ఆయన తరపున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ 2 సెక్షన్లు కొట్టివేస్తే చంద్రబాబుకు బెయిల్ వస్తుంది. న్యాయం తమవైపే ఉందని, అక్రమ అరెస్టులతో టీడీపీని అడ్డుకోలేరు అని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.
విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విజయవాడ చేరుకుంటున్నారు. ఏసీబీ కోర్టులోవిజయవాడ ఎంపి కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరాతీశారు. తాజా పరస్థితులపై చర్చించారు. చంద్రబాబుకు అనుకూలంగానే తీర్పు వస్తుందని న్యాయవాదులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు బెయిలా, జైలా మరి కొద్ది సేపట్లో తేలనుంది. దీంతో ఏసీబీ కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
ఏపీలో అన్ని జిల్లాల ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరించారు.