CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Sai Krishna Case : సాయికృష్ణ కేసును సీబీఐకి ఇవ్వాలని ఆయన తల్లి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు సీబీఐకి వెళ్తే న్యాయం జరుగుతుందా.. లేకపోతే కోల్డ్ స్టోరేజీలోకి పోతుందా?

Sai Krishna Case to CBI: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసు విచారణ ఏ మలుపు తిరగబోతోందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బాధితులకు త్వరితగతిన న్యాయం జరగాలనే డిమాండ్‌తో ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ కి అప్పగించాలనే ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. సాయికృష్ణ తల్లి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏ చిన్న వివాదం జరిగినా సీబీఐ దర్యాప్తు కోరడం ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది కానీ, ప్రాక్టికల్‌గా చూస్తే సీబీఐకి వెళ్లిన కేసుల ట్రాక్ రికార్డ్ ఎలా ఉందనేది ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్న. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తే నిజంగానే న్యాయం వేగంగా జరుగుతుందా, లేక కేసు కాలగర్భంలో కలిసిపోతుందా ?
హైప్రోఫైల్ కేసుల్నే తేల్చలేకపోతున్న సీబీఐ
మన దేశంలో సీబీఐకి ఉన్న క్రెడిబిలిటీ పై కాలక్రమేణా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దానికి అత్యంత పెద్ద ఉదాహరణ—వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు. ఏళ్ల తరబడి సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ ఒక తార్కిక ముగింపునకు తీసుకురాలేకపోయిందనే ఆరోపణలు స్పష్టంగా ఉన్నాయి. చార్జ్‌షీట్ల మీద చార్జ్‌షీట్లు వేయడం, కోర్టుల చుట్టూ తిరగడం తప్ప నిందితులకు శిక్ష పడేలా చేయడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. కేవలం హై-ప్రొఫైల్ రాజకీయ కేసులు మాత్రమే కాదు, సాధారణ నేరాల విషయంలోనూ సీబీఐ చేతికి వెళ్లిన ఫైళ్లు కోల్డ్ స్టోరే లోకి వెళ్లిపోతాయనే భయం సామాన్యుల్లో ఉంది.
సాయికృష్ణ కేసులో పోలీసులే నిందితులు
సాయికృష్ణ కేసు ప్రత్యేకతను గమనిస్తే, ఇందులో స్థానిక పోలీసులపైనే ప్రాథమికంగా ఆరోపణలు ఉన్నాయి. విచారణాధికారులు , పోలీస్ యంత్రాంగంలోని కొందరు వ్యక్తులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని బాధితులు అనుమానిస్తున్నారు. వ్యవస్థలో ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు పోలీసులపై నమ్మకం సడలడం సహజమే. కానీ, ప్రస్తుత డిజిటల్ యుగంలో, మీడియా , సోషల్ మీడియా నిరంతరం వాచ్ చేస్తున్న తరుణంలో పోలీసులపై గతంలో కంటే వంద రెట్లు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలంటే, స్థానిక పోలీస్ యంత్రాంగం తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన కత్తిమీద సాము లాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే, ఈ కేసుపై కేవలం బాధితులు మాత్రమే కాదు.. ఉన్నతాధికారులు, కోర్టులు, ప్రతిపక్షాలు, సాధారణ ప్రజలు కూడా నిశితంగా నిఘా పెట్టారు . ఒకవేళ పోలీసులు ఈ కేసులో ఏ చిన్న తప్పు చేసినా లేదా నిందితులను తప్పించే ప్రయత్నం చేసినా డిపార్ట్‌మెంట్ ఇమేజ్ శాశ్వతంగా దెబ్బతింటుంది. కాబట్టి, తమపై ఉన్న మరకను తుడిచేసుకోవడానికైనా పోలీసులు అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా విచారణ చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది.
స్థానిక పోలీసులకు క్షేత్రస్థాయిలో ఉన్న నెట్‌వర్క్, స్థానిక భాష, భౌగోళిక పరిస్థితులపై అవగాహన సీబీఐ అధికారులకు ఉండవు. ఢిల్లీ నుంచి వచ్చే సీబీఐ బృందం ఇక్కడికి వచ్చి, కేసు ఫైళ్లను స్టడీ చేసి, స్థానిక పోలీసుల నుంచి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకునే సరికి నెలల సమయం వృథా అవుతుంది. ఈ లోపు కీలకమైన సాక్ష్యాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. పైగా సీబీఐపై కూడా రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయనే వాదనను కొట్టిపారేయలేం. అదే స్థానిక పోలీసులు అయితే, తక్షణమే స్పందించి నిందితులను చట్టం ముందు నిలబెట్టే అవకాశం ఉంటుంది. లాజికల్‌గా ఆలోచిస్తే.. సాయికృష్ణ కేసును సీబీఐకి బదిలీ చేయడం వల్ల కాలయాపన తప్ప తక్షణ ఉపశమనం లభించకపోవచ్చు. ప్రస్తుతానికైతే స్థానిక పోలీసులపైనే ఒత్తిడిని కొనసాగిస్తూ, కోర్టు పర్యవేక్షణలో విచారణ వేగవంతం అయ్యేలా చూడటమే బాధితులకు న్యాయం జరిగేందుకు ఉన్న ఏకైక మార్గం. వ్యవస్థలన్నీ చూస్తున్న వేళ, పోలీసులు తమ వృత్తిధర్మాన్ని కాపాడుకుంటూ పక్కా సాక్ష్యాలతో నిందితులకు శిక్ష పడేలా చేస్తారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.
ట్రెండింగ్ వార్తలు






















