Janasena: పవన్ కళ్యాణ్ పై ప్రేమ చాటుకున్న ఇప్పటం గ్రామస్తులు, మచిలీపట్నం సభకు తరలివచ్చి మద్దతు
మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామస్తులు మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ప్రేమ చాటుకున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామస్తులు మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ప్రేమ చాటుకున్నారు. తమకు గతంలో పలు సందర్భాల్లో అండగా నిలిచిన నేత అని పవన్ పై ప్రశంసల జల్లులు కురిపించారు. నేడు మచిలీపట్నంలో జరుగుతున్న జనసేన సభకు రెండు బస్సులలో ఇప్పటం గ్రామస్తులు సభకు బయలుదేరారు. మచిలీపట్నం సభా ప్రాంగణానికి వచ్చే జనసైనికుల కోసం 5 వేల పులిహోర ప్యాకెట్లు తయారు చేసి తమ వెంట తీసుకొస్తున్నారు ఇప్పటం గ్రామస్తులు.
పార్టీ పదో ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మచిలీపట్టణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనం అయిన వారాహి వాహనంపై సభ వేదిక వద్దకు వెళ్ళేందుకు ప్లాన్ చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వారాహి వాహనంపై సభకు బయలుదేరేలా పవన్ ముందుగా ప్లాన్ చేశారు. మంగళగిరి నుంచి విజయవాడకు జాతీయ రహాదారి మీదగా వచ్చిన పవన్ అక్కడ నుంచి విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్ మీదగా పటమట, ఆటోనగర్, కానూరు, పెనమలూరు, కంకిపాడు మీదగా మచిలీపట్టణం సభావేదిక వద్దకు వెళ్ళందుకు ముందుగా రూట్ మ్యాప్ డిజైన్ చేశారు.
రూట్ మ్యాప్‌లో మార్పులు...
పోలీసుల అభ్యంతరంతో పార్టీ ఆవిర్బావ సభకు వెళ్లేందుకు జనసేన అధినేత రూట్ మ్యాప్‌ను కూడా మార్పులు చేశారు. ముందుగా అనుకున్నట్లుగా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీని రద్దు చేసుకున్నారు. పవన్ బస చేసిన నోవోటెల్ హోటల్ నుంచి బయల్దేరి, విజయవాడ శివారులో ఉన్న ఆటోనగర్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి వారాహి వాహనంపై ర్యాలి ప్రారంభించారు. దీంతో విజయవాడ సిటిలో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తప్పుతాయని పోలీసులతోపాటుగా వాహనచోదకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అసలే ఎండలు మండిపోతున్న తరుణంలో పవన్ రోడ్ షో అంటే, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. దీంతో పవన్ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో పోలీసులు హమయ్యా అంటూ రిలాక్స్ అయ్యారు.
ఇప్పటానికి జనసేనాని అండ....
ఏపీలో ఇటీవల రాజకీయంగా వేదికగా మారిన గ్రామం ఎదైనా ఉందంటే అది ఇప్పటం గ్రామం మాత్రమే. గుంటూరు జిల్లా పరిదిలోని మంగళగిరి, తాడేపల్లి నగర పాలక సంస్ద పరిధిలో ఉన్న ఈ గ్రామంలోనే ఇటీవలే జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవస్థాపక సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. వాస్తవానికి జనసేన వ్యవస్థాపక సభను నిర్వహించేందుకు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో చాలా చోట్ల స్థలాలను జనసేన నాయకులు పరిశీలించారు. అయితే అధికార పార్టీ అడ్డంకులు, అధికారుల బెదిరింపులతో సభ నిర్వహించేందుకు భూమి కూడా దొరకని పరిస్దితుల్లో ఆఖరి నిమిషంలో ఇప్పటం గ్రామంలో జనసేన సభకు భూములు ఇచ్చారు. దాదాపుగా 14ఎకరాల స్దలంలో జనసేనాని పవన్ సభను నిర్వహించారు.
అదే సభలో పవన్ గ్రామ సంక్షేమం కోసం 50లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆ తరువాత జనసేన నాయకులు ఆ మొత్తాన్ని స్థానిక గ్రామాధికారులకు చెక్ రూపంలో అందించారు. అయితే 50లక్షల రూపాయలు విరాళాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని స్థానిక అధికారులు ఆదేశాలు ఇవ్వటంతో గ్రామస్థులు ఎదురు తిరిగారు. దీంతో స్థానికంగా అధికారులు, అధికార పార్టి నాయకులు, జనసేన నాయకులకు మధ్య వివాదం మొదలైంది.