(Source: ECI/ABP News/ABP Majha)
Pawan Kalyan: 1 నుంచి పవన్ వారాహి యాత్ర, సీఎం జగన్ ప్రభుత్వమే టార్గెట్!
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు రానున్నారు. నాలుగో దశ వారాహి విజయ యాత్రకు సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు రానున్నారు. నాలుగో దశ వారాహి విజయ యాత్రకు సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇప్పటికే మూడు దఫాలు వారాహి యాత్రను పవన్ నిర్వహించారు. నాలుగో దశ యాత్రకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
అక్టోబరు 1వ తేదీ పవన్ యాత్ర ప్రారంభం కానుంది. 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగిస్తారు. మచిలీపట్నంలో 2,3 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే 2న కృష్ణా జిల్లా జనసేన నేతలతో సమావేశమవుతారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు 3న జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. 4న పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారని జనసేన పార్టీ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.
సమన్వయకర్తల నియామకం
ఈ సందర్భంగా వారాహి యాత్రకు సమన్వయకర్తలను పార్టీ అధిష్టానం నియమించింది. అవనిగడ్డ నియోజకవర్గానికి పోతిన వెంకట మహేష్, తాతంశెట్టి నాగేంద్ర, మండలి రాజేష్, పెడన నియోజకవర్గానికి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, అమ్మిశెట్టి వాసు, చిల్లపల్లి శ్రీనివాస్, కైకలూరు నియోజకవర్గానికి ముత్తా శశిధర్, చనమల్ల చంద్రశేఖర్‌లను సమన్వయకర్తలుగా నియమించినట్లు తెలిపింది.
1వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో వారాహి విజయ యాత్ర#VarahiVijayaYatra pic.twitter.com/lt6fefyK0X
— JanaSena Party (@JanaSenaParty) September 29, 2023
మూడు విడతల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలో పవన్ పర్యటన కొనసాగింది. మొదటి విడతలో ఉమ్మడి గోదావరి జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో విడతలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారాహి జైత్రయాత్ర కొనసాగింది. ఇక మూడో విడత వారాహి యాత్రను ఆగస్ట్ 10 నుంచి 19వ తేదీ వరకూ ఉమ్మడి విశాఖపట్నంలో కొనసాగించారు. విశాఖపట్నం పర్యటనలో రెండు బహిరంగ సభలు నిర్వహించారు.
100 రోజులు 100 సభలు
వచ్చే నాలుగు నెలలు ప్రతి నెలా సగం రోజులు సినిమా షూటింగ్‌కు, మరో సగం రోజులు పార్టీకి కేటాయించేలా పవన్ కసరత్తు చేస్తున్నారు. నెలలో సగం రోజులు పూర్తి స్థాయిలో పార్టీపై దృష్టి సారించే విధంగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. పార్టీ నేతలు.. ఇదే సమయంలో వారాహి యాత్రతో పాటు పార్టీ జాయినింగ్స్, నియోజకవర్గాల వారీగా సమీక్షలపైనా దృష్టి పెట్టేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల వరకూ మొత్తం 100 రోజుల పాటు 100 సభలు నిర్వహించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అన్ని నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా వారాహి యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అధికార పక్షంపై పవన్ నిప్పులు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ దూకుడు పెంచారు. వారాహి యాత్రలతో పార్టీ శ్రేణులను ఉత్తేజ పరుస్తూనే వైసీపీ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ వచ్చార. ఎక్కడికక్కడ నాయకుల పని తీరు, వారి వైఫల్యాలను ఎత్తి చూపారు. మూడు దశల యాత్రలో.. విశాఖపట్నంలో క్షేత్రస్థాయి పర్యటనలకు ఎక్కువ సమయం కేటాయించారు. రుషికొండతో, ఎర్రమట్టి దిబ్బల పరిశీలన ద్వారా ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. వైసీపీ పాలనను అంతంమొందించడమే లక్ష్యంగా వారాహి యాత్ర అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయా ముసుగులో ప్రకృతిని ధ్వంసం చేస్తూ... ప్రజాధనాన్ని దోచకుకుంటే సహించేది లేదని అధికార పార్టీ నాయకులకు హెచ్చరించారు.